13-01-2026 12:00:00 AM
మకర సంక్రాంతి పురస్కరించుకొని పెద్దలు, పిల్లలు.. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో భారీ ఎత్తున పతంగులు ఎగురవేయడం ఆనవాయితీ. అయితే పతంగులు ఎగురవేయడమనేది ఈ కాలం నాటిది కాదు అని చరిత్రను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు తన సోదరులు, హనుమంతునితో కలిసి స్వయంగా గాలి పటాలు ఎగురవేసినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. గాలిపటం ఒక సాధారణ ఆట వస్తువులా కనిపించినప్పటికీ దాని వెనుక వేల సంవత్సరాల చరిత్ర, సైనిక, సాంకేతిక, సాంసృ్కతిక ప్రాముఖ్యత దాగి ఉంది. గాలిపటం ఎగురవేయడం వెనుక దాదాపు 2 వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఇది చైనాలో ప్రారంభమైంది.
ఆ సమయంలో గాలిపటాన్ని సందేశాలను పంపడానికి ఉపయోగించారు. భారతదేశానికి గాలిపటాన్ని చైనా యాత్రికులు ఫాహియాన్, హూయాన్ త్సాంగ్ తీసుకువచ్చినట్లు చరిత్ర స్పష్టం చేస్తున్నది. గాలి పటాలు భారత దేశంలోనే గాక చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా లాంటి దేశాల్లోనూ ఎగురవేస్తుంటారు. గుజరాత్ ప్రజలు సంక్రాంతి పండుగ సమయాల్లో ‘కైట్ ఫెస్టివల్’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. ఈ గాలి పటాలు ఎగురవేసేటప్పుడు నిలబడి ఆకాశం వైపు చూడటం వలన కంటి చూపు మెరుగవుతుందని, శరీర కండరాలకు మంచి వ్యాయాయం చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటారు.
చలి కాలంలో పగటి పూట ఎండలో నిలబడి పతంగులు ఎగురవేస్తే దేహానికి సూర్యరశ్మి తగలడంతో పాటు మన శరీరంలోని బాక్టీరీయా నశించి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటుంది. అంతేకాదు సూర్యరశ్మి వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ పుష్కలంగా లభిస్తుందని, అందుకే ఎన్నోవేల ఏళ్లుగా గాలి పటాలు ఎగురవేయడమనేది ఒక ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. అయితే గాలి పటాలు ఎగురవేయడంలో వినోదంతో పాటు విషాదాలు ఉన్నాయి. ఎత్తున భవనాల మీద ఎగురవేస్తూ పొరపాటున జారి పడిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, సెల్ ఫోన్ టవర్స్ మీద నుంచి గాలి పటాలు ఎగురవేయడం ద్వారా విద్యుత్ షాక్ తగిలి చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది.
గతంలో పతంగులకు దారం తెగకుండా ఉండేందుకు బియ్యం, చెట్ల జిగురు, చిగుళ్ళతో ప్రకృతి సిద్ధమైన మాంజా అనే పూత పూసేవారు. కానీ నేడు చైనా మాంజా పేరుతో గాజు పొడి, అల్యూమినియం ఆక్సిడ్, మార్కొనియం లాంటి రసాయన పదార్థాలు వాడటం వల్ల దారం ధృడంగా మారుతుంది. అయితే ఈ చైనా మాంజాతో గాలిలో ఎగిరే పక్షులు మాంజాలో చిక్కుకొని ప్రాణాలు విడుస్తున్నాయి. ఇక రహదారుల వెంట నడిచే వారికి, ద్విచక్ర వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న చైనా మాంజా ప్రాణాలను హరిస్తుంది.
ప్రాణాంతక చైనా మాంజా పేరుకు మాత్రమే చైనా మాంజా. కానీ ఇది చైనా నుంచి దిగుమతి కాదు. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలి, మధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో తయారు చేసి హైదరాబాద్‌లోని పాత నగరంలో ఎక్కువగా విక్రయిస్తున్నారు. కావున ఇలాంటి చైనా మాంజాలు వాడకుండా ప్రభుత్వ అధికారులు కఠిన ఉత్తర్వులు జారీ చేసి నిషేధం అమల్లోకి తీసుకురావాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు పట్టించుకుంటున్న దాఖలాలు లేకపోవడంతో ప్రజలే చైనా మాంజా పట్ల అప్రమత్తగా ఉండడం అవసరం. తమకు తాముగా చైనా మాంజాను వినియోగించడం ఆపేయాలి. చైనా మాంజా స్థానంలో సాధారణ రకం దారంతో పతంగులను ఎగురవేస్తూ మూగ జీవాలను రక్షించే చర్యలో ప్రజలు తమ వంతు బాధ్యత వహించాల్సిన అవసరముంది.
వేణుమాదవ్, హైదరాబాద్