సింధు క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం
- హైటెక్ సిటీలో ప్రారంభించిన ప్రధాని మోదీ
- 1,500 పడకల సామర్థ్యంతో సేవలు
శేరిలింగంపల్లి, మే 10 (విజయక్రాంతి): హైటెక్ సిటీలో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టితో నిర్మించిన సింధు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. 1,500 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో సోమవారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్‌తో పాటు 33 సూపర్ స్పెషాలిటీల సేవలను ఇక్కడ అందిస్తారు. 150కి పైగా కన్సల్టేషన్ రూములు, 29 ఆపరేషన్ థియేటర్లు, క్వాటర్నరీ కేర్ సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
హెలికాప్టర్‌లో హైటెక్ సిటీకి చేరుకున్న ప్రధాని మోదీ సంప్రదాయ పద్ధతిలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వేంకటేశ్వరుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు, ఆసుపత్రి యాజమాన్యం, వైద్య నిపుణులు పాల్గొన్నారు.






