16-12-2024 12:46:19 AM
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): పర్యావరణహిత సుస్థిర మైనింగ్‌తో పాటు సంప్రదాయేతర విద్యుత్ రంగంలో విశేష సేవకు గానూ సింగరేణికి జాతీయస్థాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. దక్షిణాసియాలో పునరుత్పాదక ఇందన వనరులను ప్రోత్సహించడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న సంస్థలను ఎనర్షియా ఫౌండేషన్ ఎంపిక చేసి ఏటా పురస్కారాలు అందజేస్తోంది.
ఈసారి ఇండియాస్ బెస్ట్ అండ్ మోస్ట్ సస్టేనబుల్ కోల్ మైనింగ్ ఆపరేటర్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్ క్యాటగిరీలో సింగరేణి ఎంపికైంది. ఈ అవార్డును ఈనెల 20వ తేదీన విశాఖపట్నంలో అందజేయనున్నారు. పర్యావరణహిత మైనింగ్‌కు పెద్దపీట వేస్తూ..
సోలార్ విద్యుత్తు ఉత్పాదనను చేపట్టి విజయవంతంగా ముందుకు సాగుతున్న సింగరేణిని జాతీయస్థాయిలో అత్యుత్తమ సంస్థగా ఎంపిక చేసినట్టు అవార్డు కమిటీ జ్యూరీ కన్వీనర్ ఆర్ త్యాగరాజన్ అయ్యర్ ఆదివారం తెలిపారు. సింగరేణి చేపడుతున్న పర్యావరణహిత చర్యలకు ఈ అవార్డు గుర్తింపు వంటిదని ఆ సంస్థ సీఎండీ బలరామ్ పేర్కొన్నారు.
18,500 మొక్కలు నాటిన సీఎండీ
తెలంగాణ ట్రీ మ్యాన్ అవార్డు గ్రహీత, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ ఆదివారం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో స్వయంగా 209 మొక్కలను నాటారు. దీంతో ఆయన ఇప్పటి వరకు 18,500 మొక్కలు నాటారు. ఒక అత్యున్నత అధికారిగా ఉంటూ ఇన్ని మొక్కలు నాటిన ఘనత బలరామ్‌కే దక్కుతుంది.
కర్బన ఉద్గారాలు పెరిగి, గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తున్న క్రమంలో మానవాళి మేల్కొని మొక్కలు నాటి భూమాతను రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో 40 చోట్లకుపైగా మొక్కలు నాటగా.. అందులో 90 శాతానికి పైగా వృక్షాలుగా మారడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలని సీఎండీ సూచించారు.