16-12-2024 12:22:22 AM
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న సెషన్స్ ప్రారంభం కాగా.. తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ అనంతరం ఒక్క రోజుతోనే ముగిశాయి. అనంతరం నేటికి వాయిదా వేశారు. కాగా సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 11 గంటల వరకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది.
గ్రామపంచాయతీల్లో బీటీ రోడ్లు, మున్సిపల్ కార్మికుల క్రమబద్ధీకరణ, పంచాయతీలు, మండల పరిషత్‌లు, జెడ్పీలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపు, ముదిరెడ్డిపల్లి చెరువులో నీటి కాలుష్యం, రాష్ట్రంలో నూతన టీజీఐఐసీ పార్కుల ఏర్పాటు, పర్యాటకానికి ప్రోత్సాహం, ఉస్మానియా వర్సిటీలోని బీఈ విద్యార్థుల డిటెన్షన్, బెల్టుషాపుల మూసివేత, ఐవీఎఫ్ కేంద్రాలు, జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలపై ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.
అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కె.జ్యోతీదేవి, ఊకే అబ్బయ్య, డి.రామచంద్రారెడ్డిలకు సంతాపం తెలుపనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ముందుకు పలు బిల్లులు రానున్నాయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, యువ భారత వ్యాయామ విద్య బిల్లు మండలిపై సభలో చర్చ జరుగుతుంది.
ఇక మండలి సైతం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. మండలిలో మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్ రెడ్డి మృతికి సంతాపం తెలుపుతారు. తెలంగాణలో పర్యాటక విధానంపై ఉభయ సభల్లోనూ స్పల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే రేపటి బీఏసీ సమావేశంలో శాసనసభ పనిదినాలపై చర్చ జరగనుంది.