23-01-2025 12:00:00 AM
బిజీలైఫ్‌లో చాలామంది గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. అలా కూర్చుని ఉండటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కదలికలు లేక ఎముక పటుత్వము తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదేపనిగా కూర్చోవడం వల్ల ఊబకాయం బారిన పడేలా చేస్తుంది. ఈ కారణంగా మరిన్ని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
రోజురోజుకూ మనిషి శరీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి పనికి యంత్ర పరికరాలు ఉండడం, మరోవైపు సెల్ ఫోన్లు, కంప్యూటర్లతో ఏసీ గదుల్లో ఉద్యోగాల కారణంగా గంటలు గంటలు అలానే కూర్చొని ఉండ డం, శరీరాలు అటు ఇటు కదిలించేందుకు ఎక్కడా అవకాశం లేకుండా పోతుం ది. ఒకే చోట గంటల తరబడి కూర్చుని పని చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుండెపోటు ముప్పు
కదలకుండా అలానే కూర్చునే వారికి గుండె జబ్బుల ముప్పు రెండింతలు ఎక్కువగా ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూర్చుంటే మన శరీరంలోని కండరాలు కొవ్వును ఎక్కువగా కరిగించలేవు. రక్తప్రసరణ కూడా మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు పూడుకోవడం మొదలుపెడుతుందని.. ఇదే గుండె జబ్బుకు, గుండె పోటుకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ స్థాయులూ పెరుగుతాయి.
వెన్నెముకకు ప్రమాదం
ఒకే చోట కూర్చొని ఉండటం వల్ల వెన్నముక సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. కుర్చీలో ఎక్కవసేపు అలానే కూర్చుని ఉండటం వల్ల కడుపు కండరాలు సడలిపోవటం, వీపు కండరాలు బిగుతు కావటం.. వెన్నెముక ముందుకు వంగిపోవడంతోపాటు సమస్యలకు దారితీస్తుంది. రోజంతా కూర్చుని ఉండే వారిలో తుంటి ఎముక భాగం బిగుతుతనం కోల్పోయి నడిచే సమయంలో పటుత్వం కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.
క్యాన్సర్ రిస్క్
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల చాలా తక్కువ శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల ఊబకాయం రావటం, రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది.