22-01-2025 12:52:10 AM
ఆమెది రంగుల ప్రపంచం..ఎలాంటి ఊహలకు తావులేకుండా ఉన్నది ఉన్నట్టుగా గీయడం ఆమెప్రత్యేకత.కాన్వాస్‌పై ఆయిల్ పెయింటింగ్స్‌తో అద్భుతాలను సృష్టిస్తున్నది ఆర్టిస్టు రుక్మిణి కర్లపాటి. ఆర్టిస్టుగా తన రెండు దశాబ్దాల చిత్రకళ అనుభవాలను ఖజానాతో పంచుకున్నారామె..
మాది హైదరాబాద్. నా చిన్నతనం, చదువువంతా హైదరాబాద్‌లోనే. మా నాన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగి. 2006లో ఆర్టిస్టుగా నా జర్నీ మొదలైంది. అప్పటి నుంచి వేస్తూనే ఉన్నా.. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలి అనే తపన బాగా ఉండేది నాకు. మా పేరెంట్స్‌కు చదివించే స్థోమత ఉన్నా.. నాకు ఆర్ట్ పట్ల బాగా ఇష్టం ఉండేది.
బేసిక్స్ ఎక్కడ నేర్చుకున్నారు?
ఏదో ఒకటి క్రియేటివ్‌గా చేయాలని అనుకుని హిమయత్ నగర్‌లోని స్వామి సర్‌తో సిరి ఆర్ట్ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయ్యా. అక్కడే ఆర్ట్‌కు సంబంధించిన బేసిక్స్ నేర్చుకున్నా. మా సర్ హయంలో ఒక షో చేస్తున్న సమయంలో నా పెయింటింగ్స్ కూడా తీసుకున్నారు. ఆర్ట్ అంటే ఇష్టం కావడం, దానికి తోడు ఆదాయం రావడం వల్ల అప్పటి నుంచి పెయింటింగ్స్ వేస్తున్నాను.
ఆయిల్, ఆక్రాలిక్ డ్రాయింగ్స్‌కు వేరు వేరు షీట్స్ వాడతారు అనే ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చేసింది ఇనిస్టిట్యూట్‌లో. అలా ఫొటోస్ చూసి డ్రా చేయడం.. మెల్లమెల్లగా దాని నుంచి.. కలర్స్ ఎంపిక చేసుకోవడం అలవాటైంది. జస్ట్ ‘వాట్ ఐ యామ్ సీయింగ్’ అనేదే ఫాలో అయ్యా. డార్క్ కలర్స్ కన్నా లేత రంగులే ఎక్కువగా ఇష్టపడతా.. నా టేస్ట్ కూడా అదే.
సబ్జెక్ట్స్ ఎంపిక ఎలా చేసుకుంటారు?
నాకు నచ్చిందంటే.. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్, ఫొటోగ్రఫీ రిఫరెన్స్ తీసుకుని వర్క్ చేస్తా. దాన్ని ఆర్ట్ లాగా ఎలా చేయాలని ఊహించుకుంటూ పెయింటింగ్ వేస్తా. చివరికి అవుట్ కమ్ వచ్చేసి ఫుల్ ఆర్టిస్టిక్‌గా మారిపోతుంది. అంటే సింపుల్ సబ్జెక్ట్‌ను కూడా అందంగా మార్చడానికి అవకాశం ఉంటుం ది. నాకు ఇష్టమైన సబ్జెక్ట్.. ఎక్స్‌ప్రెషన్స్. వాటిమీదే ఎక్కువగా ఫోకస్ చేస్తా. అలాగే పోర్ట్రెయిట్స్, జీవితానికి సంబంధించిన వాటిని చాలా ఫీల్ అవుతూ.. ఇంట్రెస్ట్‌గా వేస్తుంటాను.
మీకిష్టమైన ఆర్టిస్టు?
నాకు ఇష్టమైన ఆర్టిస్టుల్లో అమెరికన్ ఆర్టిస్ట్ నార్మన్ రాక్వెల్ ఒకరు. ఆయన పెయింటింగ్స్‌ను ఒక ఆరు నెలలు ఇంట్లో ఉండి స్టడీ చేశా. నార్మన్ రాక్వెల్ పెయింటింగ్స్ నుంచి చాలా నేర్చుకున్నా.. అలా రకరకాల సబ్జెక్ట్స్ తీసుకుని.. వేస్తూ పోయా. అతని పెయింటింగ్స్‌కు బాగా కనెక్ట్ అయ్యా. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు.. కానీ మొదట నాకు బీజం నాటింది మాత్రం ఆయనే.
ఒక్క పెయింటింగ్ వేయడానికి ఎంత సమయం పడుతుంది?
ఏ సబ్జెక్ట్ అయినా బాగా లీనమైపోయి డ్రా చేస్తాను. బేసిక్‌గా చెప్పా లంటే వర్క్‌ను బాగా ఎంజాయ్ చేస్తా. ఒక్క పెయింటింగ్ పూర్తి కావడానికి మూడు నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది. ఇప్పటి వరకు పూర్తికాని పెయింటింగ్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఒక పెయింటింగ్ వేసేంటప్పుడు చాలా డెప్త్‌గా వెళ్తాను.
మీరు పాల్గొన్న షోస్ గురించి?
నా పెయింటింగ్స్‌ను చాలామంది ఇష్టపడతారు. ఒక ఆర్టిస్టుగా హైదరాబాద్‌లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, గ్యాలరీ స్పెస్, బెంగళూరులో రేవెస్ ఆర్ట్ గ్యాలరీ, చిత్రకళ పరిషత్ బెంగళూరు, బాంబే బజాజ్ ఆర్ట్ గ్యాలరీ, నాగ్‌పూర్.. కోనసీమ చిత్రకళ పరిషత్.. ఇలా ఏ ప్లాట్‌ఫాం దొరికితే ఆ ప్లాట్‌ఫాంలో నా పెయింటింగ్స్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం సేల్ అయ్యాయి. కొందరు కమర్షియల్‌గా కూడా పెయింటింగ్స్ వేయించుకుంటారు.
కొత్త ఆర్టిస్టులకు మీరిచ్చే సలహా?
ఆర్ట్ అనేది ఎవరో వేస్తున్నారు.. మనం వేయాలి అనే ఉద్దేశ్యంతోనో లేదా వాళ్లు ఆ స్టయిల్లో వేస్తున్నారు. మనం కూడా అదే ఫాలో అవుదామంటే కుదరదు. ఎవరి స్టయిల్ వాళ్లకుంటుంది. సొంతంగా.. వర్క్‌ను ఎంజాయ్ చేసుకుంటూపోతే చాలా బాగుంటుంది. కాపీ కొట్టడం వల్ల తృప్తి, ఆనందం రెండూ లైఫ్‌లో మిస్ అవుతాం కదా!.