calender_icon.png 29 September, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి తగాదాలతో సైనికుడు ఆత్మహత్యాయత్నం

29-09-2025 12:45:04 AM

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చీకోడ్‌లో ఘటన

సిద్దిపేట, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి):ఆస్తి తగాదాలతో ఓ సైనికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న హృదయ విధాకార సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. చీకోడ్ గ్రామానికి చెందిన దొడ్ల అశోక్ గౌడ్ ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఆస్తి పంపకాల్లో వాటా ఇవ్వడంలేదని తన తల్లి సులోచన, తమ్ములు అరుణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ లతో పాటు వీరికి సహకరిస్తున్న ఇదే గ్రామానికి చెందిన చెలుకల నర్సారెడ్డి, జి శ్రీనివాస్ గౌడ్, జి అంజలిలే బాధ్యులని సూసైడ్ నోట్ రాసి, సెల్ఫీ వీడియో తీసి గుర్తు తెలియని మాత్రలు వేసుకున్నాడు. నా చావుతోనైనా సమాధానం దొరుకుతుందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన భార్య పల్లవికి, పిల్లలు హృదయ, శివేంద్ర, బాబాయి రమేశ్ గౌడ్, పిన్ని, సన్నీ, బన్నీ, మిత్రుడు సుధాకర్ లకు ఇక సెలవంటూ బాధాతప్త హృదయంతో మాత్రలు మింగాడు. అశోక్ ప్రస్తుతం సిద్దిపేట ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.