05-07-2025 07:32:02 PM
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే ప్రభుత్వం భర్తీ చేయాలి
సూర్యాపేట నిరుద్యోగ విద్యార్థి మహాసభలో విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు
సూర్యాపేట,(విజయక్రాంతి): నిరుద్యోగులు సంఘటితమై శాంతియుతమైన పోరాటం ద్వారానే నిరుద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపకులు, తెలంగాణ ఉద్యమకారులు, డాక్టర్ పృధ్విరాజ్ యాదవ్, అశోక అకాడమీ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పాలకూరి అశోక్ అన్నారు. రెండు లక్షల ఉద్యోగాల సాధనకై అనుములపురి జనార్ధన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో శనివారం ఏర్పాటుచేసిన నిరుద్యోగ విద్యార్థి మహాసభకు వారు ముఖ్యఅతిదులుగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగ సమస్య తాండవిస్తుందని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సూర్యాపేట ప్రాంతం ఎంతో చైతన్యవంతమైందని, గతంలో తెలంగాణ మహాసభ ఇక్కడి నుంచే ప్రారంభమైందని, బండి యాదగిరి లాంటి వాళ్ళు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేశారు. నిరుద్యోగ విద్యార్థి మహాసభ ఇక్కడి నుంచే నాంది పలకటం హర్ష నీయమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు కల్పించి ఉద్యోగ కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ కొరకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే రిటైర్మెంట్ కాల పరిమితిని 61 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే అన్ని ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.