మంథని గొల్లగూడెంలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం
రూ.20 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం
మంథని, ఆగస్టు 17 (విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. డ్రైనేజీ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న స్థానికుల సమస్యను మున్సిపల్ పాలకవర్గం దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించి గొల్లగూడెం ప్రాంతంలో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ పోతరబోయిన శ్రీలత డ్రైనేజీ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించేందుకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే మురుగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య సమస్యలు కూడా తగ్గి స్థానికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, యేల్లంకి వంశీధర్, నాయకులు పోతరబోయిన క్రాంతికుమార్, లైశెట్టి రాజుతో పాటు స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






