09-12-2025 07:56:48 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ డీసీసీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్, హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డిలు హాజరయ్యారు. మొదట కేక్ కట్ చేసి హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లా ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ప్రతియేటా ఘనంగా నిర్వహిస్తున్నామని వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తు, హనుమకొండ, వరంగల్ జిల్లా ప్రజల, పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకురాలని, ప్రపంచంలోనే ఒకే ఒక్క కుటుంబం మొత్తం కూడా దేశం కోసం హత్యలకు గురైనారని, వారి త్యాగం చిరస్మరణీయమని అన్నారు. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన సోనియా గాంధీ ని బీజేపీ నాయకులు ఎన్నో సార్లు అపనిందలు, అవమానాలు చేసిన నిలదొక్కుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
మెట్టినింటికి వచ్చి గాంధీ వారసత్వం ఎలా వుంటదని అవహేళన చేసిన మూర్ఖులు బీజేపీ నాయకులు. ఆనాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా చేసిన గొప్పనాయకురాలు సోనియా గాంధీ అని అన్నారు. దేశంలో రూపాయి పతనం, ఇండిగో విమానాల రద్దును ప్రజల నుంచి తప్పుదోవ పట్టించేలా ప్రధాని మోడీ, నెహ్రూ ని విమర్శించడం సరికాదన్నారు. దేశంలో జరుగుతున్న ఆర్ధిక సంక్షోభం పై బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
గాంధీజీని చంపిన గాడ్సే గొప్పోదనడం సిగ్గుచేటు అని, మీరూ మీ పార్టీ దేశానికి చేసింది ఏంటని అన్నారు. రూపాయి పాతనానికి కారణం బీజేపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలే అని అన్నారు. ఈ వేడుకలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లు బొద్దిరెడ్డి ప్రభాకర్, ఇ.వి శ్రీనివాస్ రావు, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.