సోనియాది ఇటాలియన్ రక్తం
ఆమె కేవలం భారతీయ పౌరుణ్ని వివాహం చేసుకున్నారంతే..
అందుకే.. ఆమె వందేమాతర గీతాలాపనను ఆపారు
ఇప్పుడు.. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు
కేంద్ర మంత్రి కుమార్‌స్వామి
బెంగళూరు, ఆగస్టు ౧౮: ‘ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ నరనరాల్లో ఇటాలియన్ రక్తమే ప్రవహిస్తున్నది. ఆమె భారతీయురాలు కాదు. రాజీవ్‌గాంధీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఇక్కడికి వలస వచ్చారు. ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఈనెల ౧౫న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో వందేమాతర గీతాలపనను ఆమె ఆపిందనేది వాస్తవం.
ఆ సమయంలో ఆమె చేసిన సంజ్ఞలే అందుకు సాక్ష్యం. ఇప్పుడామె ఎన్ని సాకులు చెప్పినా, నిజాన్ని కప్పిపుచ్చాలని చూసినా ఆ ప్రయత్నాలు వ్యర్థం’ అంటూ కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. తద్వారా సోనియాగాంధీ జాతీయతను ప్రశ్నించారు. కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా ఆలస్యంగా వెలుగు చూశాయి.
రాజీవ్‌గాంధీ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారని, కానీ.. సోనియాగాంధీ భారత ప్రజల కోసం ఎలాంటి త్యాగం చేయలేదని విమర్శించారు. ఆమె కేవలం ఒక భారతీయ పౌరుణ్ణి వివాహం చేసుకున్న మహిళ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆమె ఇటలీ దేశస్థురాలు కాబట్టే భారతీయ భావోద్వేగాలను వ్యతిరేకిస్తున్నారని, దీనిలో భాగంగానే ఇటీవల ఆమె వందేమాతర గీతాలపనను అడ్డుకున్నారని ఆరోపించారు. మరోవైపు, కేంద్ర మంత్రి కుమారస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కుమారస్వామిపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అయినప్పటికీ, కుమారస్వామి వెనక్కి తగ్గలేదు.
మంగళవారం కూడా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. సోనియాగాంధీపై తనకున్న కచ్చితమైన అభిప్రాయాలను స్పష్టం చేశానని ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి రిజ్వాన్ అర్షద్ స్పందిస్తూ.. కుమారస్వామిని నిరాశ, నిస్పృహలతో ఉన్నారని, అందుకే ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ గురించి మాట్లాడే అర్హత కుమారస్వామికి లేదని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ ఒక సగటు భారతీయుడి కంటే, నిబద్ధత గల భారతీయురాలని కొనియాడారు.






