ఉద్దీపకం వర్క్‌షాపుపై ప్రత్యేక శ్రద్ధ
బూర్గంపాడు, ఆగస్టు 20, (విజయక్రాంతి): జీపీఎస్ పాఠశాలల విద్యార్థులకు పునాది స్థాయి నుంచే విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉద్దీపకం వర్క్బుక్లోని అంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. గురువారం ఉప్పుసాక స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని రాజీవ్నగర్ జీపీఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులను వర్క్బుక్లోని అంశాలు, గుణకారాలు, భాగహారాలపై ప్రశ్నించి వారి అవగాహనను పరిశీలించారు. వర్క్బుక్-3లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే సాధారణ అంశాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, చంద్రయాన్, రోబోటిక్స్, భారతీయ సంస్కృతి తదితర అంశాలను చేర్చినట్లు తెలిపారు. విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, గైర్హాజరయ్యే పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీఆర్పీ శ్రీదేవి, హెచ్‌ఎం ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.






