21 August, 2026 | 2:11 AM

అక్రమ నిర్మాణాలు,అనుమతుల లేని వెంచర్లపై చర్యలు

21-08-2026 01:21 AM
  1. రెవిన్యూ,మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో త్వరలో విచారణ
  2. మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ వెల్లడి

బాన్సువాడ, ఆగస్టు 20 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అక్రమార్కుల ఇష్టారాజ్యం అనే కథనాన్ని విజయ క్రాంతి ఎడిషన్లో గురువారం ప్రచురితమైన కథనానికి బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ స్పందించారు. అక్రమ నిర్మాణాలపై త్వరలోనే సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణంలో భవన నిర్మాణ అనుమతులు, నిర్మాణం జరుగుతున్న స్థలాల వివరాలు, అనుమతించిన అంతస్తులు,

నిర్మాణ వినియోగం తదితర అంశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.అనుమతులు ఒక విధంగా తీసుకుని, అందుకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించినా, అనుమతి లేని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అలాగే నివాస భవనాలకు అనుమతులు తీసుకుని వాణిజ్య లేదా విద్యాసంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణాలపై కూడా నిబంధనల ప్రకారం పరిశీలన చేస్తామని తెలిపారు.లేఅవుట్ అనుమతులు, భవన నిర్మాణ అనుమతులు, రహదారులు, పార్కింగ్, సెట్బ్యాక్స్ తదితర నిబంధనలు పాటించని నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు.

అవసరమైతే సంబంధిత నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేసి, అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. త్వరలోనే రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులతో ఒక బృందంగా ఏర్పడి ప్రభుత్వ స్థలాలు, మున్సిపల్ స్థలాలు, లేఅవుట్లకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా పరిశీలన చేపడతామని కమిషనర్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణంలో భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు పర్యవేక్షణను మరింత పెంచుతామని తెలిపారు.