03-01-2026 09:15:48 PM
రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు -కలెక్టర్లు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోల అధికారి మాట్లాడుతూ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.
ఓటరు జాబితాలో కేటగిరీలుగా మ్యాపింగ్, డెస్క్ పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులకు రోజువారీగా లక్ష్యాన్ని నిర్దేశించాలని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్లు, రాజకీయ పార్టీల సహకారం తీసుకొని సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి - కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి - కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్నామని తెలిపారు. ఓటరు జాపుతాను పోలింగ్ కేంద్రాల వారిగా ఎ బి సి డి కేటగిరీలుగా విభజించి బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లతో ప్రతి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు.
ఓటరు జాబితాలో ఒకే రకమైన నమోదులను గుర్తించి, మరణించిన, గ్రామము వదిలి వెళ్ళిపోయిన వారిని గుర్తించి ఫారం 8 ద్వారా నోటీసులు జారీ చేసి వివరాలు జాబితా నుండి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం, రాజకీయ పార్టీల సహకారంతో కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులను అందిస్తామని, నిర్ణీత గడువులోగా కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.