03-01-2026 09:12:36 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆడపిల్లలకు విద్యా ప్రాముఖ్యతను చాటి చెప్పిన క్రాంతికారి సావిత్రిబాయి పూలేను స్ఫూర్తికి తెచ్చుకునే విధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన సావిత్రిబాయిపూలే జయంతి వేడుకల కార్యక్రమంలో విద్యార్థినిలు జ్యోతిబాపూలే వేషధారణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. చదువుల తల్లి, రచయిత, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ పొక్కుల సదానందం అధ్యక్షత వహించగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మదార్ గౌడ్, బానోతు భీమ్లా నాయక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మైస శ్రీనివాస్, డాక్టర్ చింతా రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. సమాజంలో ఉన్న అసమానతల పైన పోరాడిన, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే , విద్య యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి స్త్రీల కొరకు పాఠశాలలను నెలకొల్పి, ఆధిపత్య కులాల అవమానాలను, దాడులను, అవహేళన లను, తట్టుకుంటూ మహిళలకు విద్యను అందించారని కొనియాడారు.
జ్యోతిబాపూలే సాంగత్యంలో చైతన్యవంతురాలిగా విద్యను నేర్చుకుని తను నేర్చుకున్న విద్యను, జ్ఞానాన్ని సమాజానికి అందజేయాలని సంకల్పంతో పనిచేశారన్నారు. సమాజంలో ఉన్న అస్పృశ్యత పైన ,స్త్రీల సమస్యల పైన, సతి దురాచారాల పైన పోరాటం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి అని, విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యా పైన మక్కువ పెంచుకొని, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, చక్కని జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 25 మంది మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలికల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డిపి గణేష్, బామ్సెఫ్ రాష్ట్ర నాయకులు బానోతు వీరన్న, బోడ లక్ష్మణ్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.