మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
ఎన్‌రోల్‌మెంట్ పెంపునకు కార్యాచరణ చేపట్టాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్, జూలై 3: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) పెంపుతో పాటు మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.
ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. పాఠశాలలకు కల్పించిన గ్యాస్ కనెక్షన్లు, ఇతర మౌలిక సదుపాయాలను సక్రమంగా వినియోగించాలని, యూడైస్ పోర్టల్లో వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని ఆదేశించారు.
ప్రతి పాఠశాలలో బాలబాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, పదో తరగతి విద్యార్థులకు గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ప్రత్యేక బోధన అందించి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.






