పాంచ్ న్యాయ్ పక్కా
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో
విడుదల చేసిన దీపాదాస్ మున్షీ, శ్రీధర్‌బాబు
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: దీపాదాస్
రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తాం: మంత్రి దుద్దిళ్ల
రాయ్‌బరేలీకి వెళ్లిన సీఎం రేవంత్.. మ్యానిఫెస్టో విడుదలకు గైర్హాజరు
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను ప్రకటించింది. 23 హామీలతో కూడిన ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు శుక్రవారం గాంధీభవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దీపాదాస్‌మున్షీ మాట్లాడుతూ..‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెం టీస్’తోపాటు తెలంగాణ ప్రత్యేక మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండి పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాహుల్‌గాంధీ దేశ ప్రజలకు న్యాయం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు న్యాయ్ యాత్ర చేశారని గుర్తుచేశారు. దేశ ప్రజలు రాహుల్‌ను ప్రధానిగా చూడాలని కోరుకొంటున్నారని, అందుకే ఇప్పుడు రాహుల్‌ను చూసి మోదీకి భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. 400 సీట్లు గెలిచి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు హామీలను అమలు చేశామని వివరించారు.
14 సీట్లు గెలుస్తాం
రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తంచేశారు. దేశంలో ఇండియా కూటమి అధికా రంలోకి రావడం అనివార్యమని, అందుకు రాష్ట్రం నుంచి 14 ఎంపీ స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయ కుడు, కార్యకర్తపైన ఉందని పేర్కొన్నారు. ఏఐసీసీ ప్రకటించిన పాంచ్ న్యాయ్ పథకాల తోపాటు పీసీసీ రూపొందించిన ప్రత్యేక మ్యానిఫెస్టోలోని అంశాలను ఇంటింటికి తీసుకెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మహేష్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, దానం నాగేందర్, చిన్నారెడ్డి, కోదండరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, నిరంజన్, ఫిరోజ్‌ఖాన్, రోహిన్‌రెడ్డి, రియాజ్, కప్పర హరిప్రసాద్, లింగంయాదవ్, మెట్టు సాయికుమార్, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మ్యానిఫెస్టో విడుదలకు సీఎం దూరం
మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారమే నామినేషన్ వేయటంతో ఆ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాయ్‌బరేలీకి ప్రత్యేక విమానంలో వెళ్తూ బేగంపేటలో ఆగారు. అదే విమానంలో ఖర్గేతో కలిసి సీఎం రాయబలేరికి వెళ్లారు. నామినేషన్ కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ధర్మపురి, సిరిసిల్ల జన జాతర సభలు, ఉప్పల్ రోడ్ షో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.
ప్రత్యేక మ్యానిఫెస్టోలోని అంశాలు
* 1) హైదరాబాద్‌లో ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్టు పున:ప్రారంభం
* 2) రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలు.
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్ విజయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే విధానం, మైనింగ్ యూనివర్సిటీ.
* 3) భద్రాచలం దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలైన ఏకపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం
* 4) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా.
* 5) హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు.
* 6) రాష్ట్రంలో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు.
* 7) రామగుండం మణుగూరు రైల్వేలైన్ ఏర్పాటు.
* 8) రాష్ట్రంలో నాలుగు నూతన సైనిక్ పాఠశాలలు ఏర్పాటు.
* 9) కేంద్రీయ విశ్వ విద్యాలయాల సంఖ్య పెంపు.
* 10) నవోదయ విద్యాలయాలు రెట్టింపు చేయడం.
* 11) ఐఐఎస్‌ఈఆర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్) ఏర్పాటు.
* 12) జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు.
* 13) ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) ఏర్పాటు.
* 14) నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ.
* 15) భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ) క్యాంపస్ ఏర్పాటు.
* 16) ఐసీఎంఆర్ పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు.
* 17) 73,74 రాజ్యాంగ సవరణను అనుసరించి కేంద్రం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు బదిలీ.
* 18) ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు.
* 19) కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లు.
* హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ నాగ్‌పూర్, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ మిర్యాలగూడ, సింగరేణి వరకు కారిడార్స్ ఏర్పాటు.
* 20) అంతర్జాతీయ ప్రమణాలతోకూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు.
* 21) మేడారం సమ్మక్క, సారలమ్య జాతరకు జాతీయ హోదా.
* 22) కొత్త డ్రై పోర్ట్.
* 23) హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు




