29 March, 2026 | 5:36 AM

బేజేపీకి ఓటు కోటాకు చేటు

04-05-2024 01:06 AM

వాళ్లకు 400 సీట్లొస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు

ప్రధాని మోదీకి తెలంగాణపై సవతితల్లి ప్రేమ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే తప్పుపట్టిన మోదీ

బీఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా పార్టీ 

ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం

కాంగ్రెస్‌ను గెలిపిస్తే చేనేతపై జీఎస్టీని తొలగిస్తాం

జగిత్యాల, సిరిసిల్ల సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి 

జగిత్యాల/రాజన్న సిరిసిల్ల, మే 3 (విజయక్రాంతి): బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను హెచ్చరించారు. బీజేపీవి మనువాద సిద్ధాంతాలని విమర్శిం చారు. 1౮81లో మనదేశంలో బ్రిటిష్‌వాళ్లు ప్రారంభించిన జనగణన కాంగ్రెస్ పాలనలో ప్రతి పదేండ్లకు ఒకసారి నిర్వహిస్తూ వచ్చామని, బీజేపీ అధికారంలోకి వచ్చాక 2021లో జనగణన చేయాల్సి ఉన్నా ఇప్పటికీ దాని గురించి ఆలోచించటం లేదని విమర్శించారు. జనగణన చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభా తెలిసిపోతుందని, అలా జరగటం బీజేపీకి ఇష్టంలేదని అన్నారు.

రిజర్వేషన్లు రద్దు చేయడం కోసమే జనగణన చేపట్టడం లేదని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీకి ఓటెయ్యాలని సూచించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన జనజాతర సభల్లో రేవంత్ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రామగుండంలో 800 యూనిట్ల పవర్ ప్లాంట్, నేతకాని కార్పొరేషన్, పత్తిపాక రిజర్వాయర్‌ను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

ప్రమాదంలో దేశం

బీఆర్‌ఎస్ పార్టీ సచ్చిన పాము అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ పాము తలను ప్రజలు ఛిద్రం చేసినా తోక ఆడిస్తూ ప్రగల్భాలు పలుకుతుందని విమర్శించారు. పదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. దేశం ప్రమాదంలో ఉందని, బీజేపీని 400 సీట్లలో గెలిపిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు చొరవతో ఆర్థిక, వ్యవసాయ, పెట్టుబడి, పారిశ్రామిక రంగాల్లో రాణించి నేడు ప్రపంచంతో పోటీ పడుతున్నామని, 5 ట్రిలియన్ డాలర్ల ఏకానమీకి పునాదులు వేసింది తెలంగాణ బిడ్డ  పీవీనేనని అన్నారు.

బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు ఎంపీగా పోటీచేసే నైతిక హక్కు లేదని విమర్శించారు. మోదీ  బయ్యా రం ఉక్కును కాలగర్భంలో కలిపేశారని, వరంగల్ ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీని లాథూర్‌కు తరలించుకుపోయారని, ఎన్టీపీసీ, పాల మూరు పథకానికి జాతీయ హోదాకు మొం డిచేయి చూపించారని ధ్వజమెత్తారు. గుజరాత్‌లో ఉన్నోళ్లు మాత్రమే మనుషులా? తెలంగాణ ప్రజలు మనుషులు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరో పదేండ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని అన్నారు. సభలో మంత్రి శ్రీధర్‌బాబు, కాం గ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం 

బీఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా పార్టీ అని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని రేవంత్‌రెడ్డి అన్నారు. సిరిసిల్ల సభలో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌లో అపర మేధావి, అరగుండు మేధావి (బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్, బండి సంజయ్)ని చాలా ఏండ్ల నుంచి చూస్తునే ఉన్నారని, రాష్ట్రంలో కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల అండతో మోదీని ఓడిస్తామని తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ నేతలు అంటే బీఆర్‌ఎస్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పరోక్షంగా బీజేపీ గెలుపునకు సాయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి తన ఎంపీలను అమ్ము కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కులగణన చేపడుతామని ప్రకటించారు. 

మోదీ, కేడీ కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరే కంగా కుట్రలు చేస్తున్నారని, తెలంగాణకు పట్టిన ఈ పీడను వదిలిస్తామని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్యాకేజీ 9ను పూర్తి చేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ మేడిపండు అయిందని, అన్నారం పగిలిపోయిందని, సుందిళ్ల దిక్కులేనిది అయ్యిందని విమర్శించారు. మిడ్ మానేరు ముంపు సమస్యలను చేనేతపై జీఎస్టీకి వ్యతిరేఖంగా పోరాడాలంటే రాజేందర్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రె స్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల సభ అనంతరం కరీంనగర్‌కు చెందిన వివిధ పార్టీల కార్పొరేటర్లు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.