10-02-2025 12:00:00 AM
మెదక్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఎరువులు, విత్తనాలు, పంట రుణాల పంపిణీలో రైతులకు క్షేత్రస్థాయిలో కీలక సేవలు అందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం ఈనెల 14న ముగియనుంది. దీంతో వీటికి ప్రత్యేకాధికారులను నియమించేం దుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, పురపాలికలన్నీ ప్రత్యేకాధికారుల పాలన లోనే ఉన్నాయి.
వారం, పది రోజుల్లో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నా యని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సహకార సంఘాల ఎన్నికలు పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల తర్వాతే ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్త పాలకవర్గాలు కొలువు తీరడానికి మరో మూడు, నాలుగు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే బ్యాంకు కార్యకలా పాలన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్నాయి.
కాబట్టి ప్రత్యేకాధికారుల పాలనతో వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని..ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే మరో ఆరు నెలలు పొడిగిస్తే బాగుంటుం దని డీసీసీబీ నాయకుడొకరు అభిప్రాయ పడ్డారు. తెలంగాణ ఆవిర్భావ సమయం లోనూ అప్పటి ప్రభుత్వం ఆరు నెలల చొప్పున నాలుగు సార్లు డీసీసీబీ పాలకవర్గాలకు కొనసాగింపు ఇచ్చిందని గుర్తు చేశారు. ఒకవేళ ప్రత్యేకాధికారుల పాలన ఉంటే రెండు, మూడు సొసైటీలకు కలిపి ఒకరిని నియమించే అవకాశం ఉంది.
జిల్లాలో కేంద్ర బ్యాంకు ఏర్పాటయ్యేనా ?
సంఘాల పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఆరు నెలల ముందుగానే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదు. మరోవైపు కొత్త జిల్లాలు ఏర్పడినా ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) సంగారెడ్డి ఆధ్వర్యంలోనే మూడు జిల్లాల పీఏసీఎస్లను నిర్వహిస్తున్నారు. కొత్తగా జిల్లాలో కేంద్ర బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో ఎన్నికలు ఒకే డీసీసీబీ కింద నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా పీఏసీఎస్లను ఏర్పాటు చేయాలని అధికారులు గతంలో ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఈ నేపథ్యంలో పాలకవర్గాలను పొడిగిస్తారా లేదంటే ప్రత్యేకాధికారులను నియమిస్తారా అనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మెదక్ జిల్లా సహకార ఇంచార్జి అధికారి కరుణాకర్ *విజయక్రాంతి*కి తెలిపారు.