27-07-2025 08:33:31 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వివిధ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ మహానగరాన్ని ఇప్పుడు క్రీడా రంగంలోనూ ప్రతిష్టాత్మక స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, ముఖ్యంగా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) తెలిపారు. ఆదివారం హనుమకొండ ఆఫీసర్స్ క్లబ్ వేదికగా జరిగిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-17 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2025 ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన యువత ప్రతిభకు వేదికలు సిద్ధం చేయడం ప్రభుత్వ బాధ్యత. త్వరలో వరంగల్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలకే సరిపడే క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. క్రీడా పాఠశాల కోసం ప్రభుత్వం సన్నద్ధతతో ముందడుగు వేసింది. నూతన భవన నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి. తరగతుల ప్రారంభానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిపై, ముఖ్యంగా యువత భవిష్యత్ పై అపారమైన దృష్టి పెట్టి, వరంగల్ నగరాన్ని అన్ని విభాగాల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వం విద్య, వ్యవసాయం, వైద్యం, క్రీడలు అన్నీ సమాన ప్రాధాన్యంతో అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం అని తెలిపారు. హనుమకొండ ప్రాంతానికి చెందిన క్రెడాయి ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమరేందర్ కుమారుడు ఐఏఎస్ అధికారి సాయి ఆశ్రిత్ ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.