calender_icon.png 28 July, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిక్కర్ స్కాం రాణి

27-07-2025 11:09:01 PM

వీరనారిని తాకడం సిగ్గుచేటు..

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

వరంగల్ (విజయక్రాంతి): లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) తెలంగాణ వీరనారి రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల చేయడం తెలంగాణ సమాజానికే అవమానమని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్(BJP District President Ganta Ravikumar) ధ్వజమెత్తారు. ఆదివారం పోచమ్మ మైదాన్ లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి రవికుమార్ క్షీరాభిషేకం చేశారు. వరంగల్ జిల్లా మహిళా మోర్చా, యువజన మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల కోసం పసిపాపను నడుముకు కట్టుకొని యుద్దరంగంలో కదం తొక్కిన రుద్రమదేవికి లిక్కర్ వ్యాపారం చేస్తూ కోట్లు గడించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూలమాల వేయడం పెద్ద అపచారమని ఆరోపించారు. ఆమె విగ్రహం వద్దకు వచ్చినంత మాత్రాన కవిత చేసిన పాపాలు పోతాయి అనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

లిక్కర్ స్కామ్ లో జైలుకు సైతం వెళ్లిన కవిత రాణి రుద్రమదేవి విగ్రహం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి క్షమించమని కోరాలని డిమాండ్ చేశారు. ఆమె విగ్రహాన్ని తాకడం వీరనారిని అవమానించినట్టేనని గంట రవికుమార్ ధ్వజమెత్తారు. అందుకే మహిళ, యువ మోర్చా ఆధ్వర్యంలో రుద్రమదేవి విగ్రహానికి క్షీరాభిషేకం చేసినట్టు స్పష్టం చేశారు. అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన కల్వకుంట్ల కుటుంబం మహనీయులు, అమరవీరుల విగ్రహాలను తాకే అర్హత లేదని రవికుమార్ ఆరోపించారు.

రాబోయే స్థానిక సంస్థల్లో లబ్ధి పొందేందుకే కవిత ఈ డ్రామాలు చేస్తోందని విమర్శించారు. వారు ఎన్ని కుయుక్తులు చేసిన ప్రజలు కవితను ఆమే కుటుంబాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక కోసమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కొత్త గ్రామాలకు తెర లేపిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే కేటీఆర్ పైకి కొట్టుకుంటూ తిట్టుకుంటూ కనిపించినా లోపల వారంతా ఒకటేనని విమర్శించారు. ఫోన్ టాపింగ్ కెసిఆర్, కేటీఆర్ లు జైలుకు వెళ్లడం ఖాయమని అలాగే లిక్కర్ స్కాంలో కవిత కూడా జైలుకు వెళుతుందని  చెప్పారు. వారి అవినీతిని  కప్పిపుచ్చుకోవడానికే ప్రజల మధ్యలో ఉంటున్నట్టు నాటకాలు ఆడుతున్నట్టు విమర్శించారు.