calender_icon.png 28 July, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిలు.. మోసాన్ని గూడా ముద్దుగ జెప్తరే!

27-07-2025 11:24:12 PM

నవ్వుల వాన కురిపిస్తున్న ‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్..

‘మై విలేజ్ షో’ ఫేమ్ అనిల్ గీలా(Anil Geela), వర్షిణిరెడ్డి జున్నుతుల(Varshini Reddy Junnuthula) ప్రధాన పాత్రల్లో రూపొందిన ప్రేమకథ ‘మోతెవరి లవ్‌స్టోరీ’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో అనిల్ గీలా, వర్షిణిరెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించగా, శివకృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు. మురళీధర్, సదానందం, సుజాత ముఖ్యపాత్రల్ని పోషించిన ఈ విలేజ్ కామెడీ లవ్ సిరీస్ ఆగస్టు 8 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అందరినీ మెప్పించింది.

తాజాగా ఆదివారం ఈ సిరీస్ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు, దర్శకుడు తరుణ్‌భాస్కర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ‘ఇగో ఇదే మా ఊరు.. ఆరెపల్లి.. ఊరూరుకూ ఓ మోతెవరి ఉన్నట్టు.. మా ఊరికీ ఓ మోతెవరి ఉన్నడు..’ అంటూ ప్రియదర్శి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. హీరో అనిల్ పరిచయం, హీరోయిన్ వర్షిణితో లవ్‌ట్రాక్, ఊరి పెద్దలు, భూ సమస్య, ప్రేమ వంటి అంశాలతో ట్రైలర్‌ను చక్కగా కట్ చేశారు. ట్రైలర్ చూస్తుంట.. ఈ సిరీస్‌ను ఆద్యంతం నవ్వులు పంచేలా మలిచారని అర్థమవుతోంది. ‘పర్శిగాడంటేనే పర్‌ఫెక్ట్’, ‘ఉశికే ఉడికించుడే’ అనే డైలాగ్స్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. ‘అమ్మాయిలు భలేగుంటరే.. మోసాన్ని కూడా ముద్దుగ జెప్తరే’ అనే డైలాగ్ ఈ సిరీస్ ఎంత బలమైన భావోద్వేగాలతో నిండి ఉందో తెలుస్తోంది. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సిరీస్‌కు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా, శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పనిచేశారు.