22 June, 2026 | 3:42 AM

గంగమ్మా.. కరుణించమ్మ..

22-06-2026 02:09 AM

కూసుమంచి, జూన్ 21 (విజయక్రాంతి): యాదవుల ఇలవేల్పు, ఆరాధ్య దైవంగా పూజలందుకునే శ్రీ గంగమ్మ తల్లి జాతర వేడుకలు కూసుమంచి గ్రామంలోని యాదవ కులస్థులు ఆదివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతరలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు సంప్రదాయ బోనాలను సిద్ధం చేసి, నెత్తిన బోనమెత్తుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు.

మరోవైపు యాదవ యువకులు, పెద్దలు కాళ్లకు గజ్జెలు కట్టుకుని భక్తి పారవశ్యంలో నృత్యాలు చేస్తూ అమ్మవారి నామస్మరణతో ఆలయానికి చేరుకోవడం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామ సుఖశాంతులు, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన భక్తులు తమ మొక్కులు తీర్చుకుని గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందారు.

నేలపై పాయశం పోసి 

భక్తులు సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన వరప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. ప్రసాదాన్ని ఒకచోట నేలపై ఉంచి భక్తిశ్రద్ధలతో నోటితో స్వీకరించడం జాతరలో విశిష్ట ఆచారంగా కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గంగమ్మ జాత రలు సామాజిక ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు వేదికలుగా నిలుస్తున్నాయి.