21-10-2025 11:10:17 AM
రాజ రాజేశ్వరుడికి అభిషేక పూజలు
కోడె మొక్కులు చెల్లింపు
ఆలయ విస్తరణ పనుల పరిశీలన
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): ధర్మ విజయ యాత్రలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతి మహాస్వామి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయంలోకి పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. రాజ రాజేశ్వర స్వామికి పీఠాధిపతి అభిషేక పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి రాజ రాజేశ్వరీదేవికి పూజలు చేశారు.
అలాగే ఆలయ ఆవరణలోని శ్రీ వీరభద్రేశ్వర, శ్రీ విఠలేశ్వర, శ్రీ నరసింహస్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత ఆంజనేయ స్వామివారికి జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతి మహాస్వామి పూజలు చేశారు.అద్దాల మండపంలో పాదుక పూజ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు, భక్తులకు ఆశీర్వచనం గావించి, రాజన్నకు ప్రీతి పాత్రమైన కోడె మొక్కును చెల్లించారు. అనంతరం ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు.
అక్కడి నుంచి భీమేశ్వరాలయం సమీపంలోని శంకర మఠం ఆవరణలో హోమం నిర్వహించి, కలశ స్థాపన పూజలు స్వామివారు గావించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఓపెన్ స్లాబ్ లో భక్తులకు ఆశీర్వచనం గావించారు. ధర్మ విజయ యాత్రలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎస్పీ మహేష్ బి గితే, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈఓ రమాదేవి, తహసిల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, తదితరులు పాల్గొన్నారు.