calender_icon.png 21 October, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ మహాశక్తి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

21-10-2025 12:14:25 PM

ముకరంపురా,(విజయక్రాంతి): దీపావళి పర్వదినం సందర్భంగా కరీంనగర్లోని మహిమాన్విత దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వాముల వారి ఆశీస్సులతో దీపావళి పండగ పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధన త్రయోదశి సందర్భంగా అమ్మవార్లకు నాణాలతో పూజ, పుష్పాభిషేకం, అమ్మవార్లకు మహాభిషేకం, మంగళద్రవ్యాభిషేకం నిర్వహించారు. నరక చతుర్దశి, దీపావళి సందర్భంగా అమ్మవార్లకు మహాహారతి,  లక్ష్మి కుబేర హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆయా వేడుకలను తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం ఏర్పడింది.

ముఖ్యంగా శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లకు అలంకరించిన కరెన్సీ నోట్లు, గాజులు, కుంకుమ, అమ్మవారి ఫోటో దీపావళి - లక్ష్మి కుబేర హోమం సందర్భంగా పూర్తిస్థాయిలో ఆలయ నిర్వాహకులు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ అందజేశారు. దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యం తమకు లభిస్తుందనే అత్యంత విశ్వాసం భక్తులకు ఉండడంతో అమ్మవారికి అలంకరించిన కరెన్సీ నోట్లు మహా ప్రసాదంగా భావించి, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే దీపావళి పర్వదినం మహోత్సవ వేడుకల కోసం దేవాలయంలో చేపట్టిన పూల, విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను ఆకట్టుకున్నాయి.