21-10-2025 07:41:13 PM
అంతా తన ఇష్టం అంటున్న చిన్నగూడూరు ఎస్ఐ..!
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న చిన్నగూడూరు మండలం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. ఈ పరిణామాలన్నీ ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయనే చర్చ మండల వ్యాప్తంగా వినిపిస్తోంది. మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి(SI Praveen Kumar Reddy) అధికార దుర్వినియోగం, అనుచిత ప్రవర్తన, ప్రజలతో అమర్యాద.. ఇవన్నీ కలసి చిన్నగూడూరును కాంట్రవర్సీ మండలంగా మలుస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రవర్సీని తానే సృష్టిస్తున్న ఎస్సై?
ప్రజల వాదన ప్రకారం, ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి తాను చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈ మండలాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో “కాంట్రవర్సీ మండలం”గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక్కడ ఏది చేసినా తప్పే... ఇక్కడ ప్రజలే సమస్య అని అబద్ధపు ఇమె సృష్టించి తన తప్పులను కవరింగ్ చేసుకుంటున్నాడని స్థానికులు విమర్శిస్తున్నారు.
పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన ఇసుక మాయం
ఠాణా లో సీజ్ చేసిన ఇసుక మాయమైంది, వేలం లేకుండా అమ్మకాలు జరుగుతున్నా చర్యలు కనిపించడం లేదు. ఇక ఆశ్చర్యకరంగా.. పోలీస్ స్టేషన్లో సీజ్ చేసి ఉంచిన ఇసుక కూడా మాయమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీజ్ రికార్డులు లేకుండా ఆ ఇసుక బయటికి వెళ్ళడం, విక్రయమవడం ప్రజల్లో అనుమానాలను రేకెత్తించింది. పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన ఇసుకే కనిపించడం లేదు ఇది ఏ చట్టం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వృద్ధ రైతు నీలం శంకరయ్య, తన భార్య నిర్మలకు అన్యాయం
ఈ వ్యవహారాల మధ్య మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వృద్ధ రైతు నీలం శంకరయ్య అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లగా, అతనిపైనే, అతని భార్యపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపింది. న్యాయం కోసం వెళ్లిన నేను నిందితుడిని అయ్యాను. నా భార్యపైన కూడా కేసు పెట్టారు. ఇంత అవమానం జీవితంలో చూడలేదు” అని బాధితుడు నీలం శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
భూమి పంచాయతీలో అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుంది?” – పబ్లిక్ టాక్
భూమికి సంబంధించిన పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తింపజేయడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. భూ వివాదం అంటే రెవెన్యూ లేదా సివిల్ అంశం… అట్రాసిటీ చట్టం ఇక్కడ ఎలా వర్తిస్తుంది?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.. చర్యలు లేవు
బాధితుడు నీలం శంకరయ్య ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశా… కానీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఎస్సై మాటే చట్టం అయిపోయింది” అని శంకరయ్య వ్యాఖ్యానించారు.
ప్రజల్లో ఆగ్రహం.. ఉన్నతాధికారుల మౌనం
మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎన్ని ఆరోపణలు వచ్చినా ఈ ఎస్సైపై ఎందుకు చర్యలు లేవు?” ఉన్నతాధికారులు కళ్ళు మూసుకున్నారా? లేక మరేదైనా అంతర్యాయం ఉందా? అనే అనుమానాలు గాలిలో తేలుతున్నాయి. ప్రజా సంఘాలు, గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు కలసి ఉన్నతాధికారులు తక్షణ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులపై ప్రజల నమ్మకం క్షీణిస్తోంది
ఇటీవలి సంఘటనలతో మండల ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పూర్తిగా తగ్గిపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య చెప్పుకోవడానికి స్టేషన్‌కి వెళ్లిన వారినే ఇబ్బంది పెడితే ప్రజలు ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలి? ఇలా కొనసాగితే పోలీసుల పట్ల ప్రజా విశ్వాసం పూర్తిగా కోల్పోతారు” అని ప్రజలు అంటున్నారు. మండల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు మనవి చేస్తున్నారు.