5 May, 2026 | 4:22 AM

జననాయగన్ పై స్టార్స్ ప్రశంసలు

05-05-2026 03:05 AM

తమిళనాడు రాజకీయాల్లో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్. దీంతో విజయ్‌పై సినీ ప్రముఖులు అభినందనల వర్షం కురిపించారు. విజయ్ గెలుపుపై స్పందిస్తూ పలువురు టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు చెప్పారు.  

ప్రేరణగా నిలవండి: చిరంజీవి 

మీ తొలి ఎన్నికల్లో సాధించిన ఈ అద్భుత విజయానికి హృదయపూర్వక అభినందనలు. మీరు నిరంతరం ప్రేరణగా నిలుస్తూ, నాయకత్వం వహించి సేవ చేయాలని కోరుకుంటున్నా. తమిళనాడు రాష్ట్ర ప్రజలకు మీ ప్రజాసేవ మరింతగా మేలు కలిగించాలని నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

బలమైన మార్పు కోరుకున్నారు: పవన్ కల్యాణ్

ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల్లో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాలన నచ్చితే మళ్లీమళ్లీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే మంచి ఉదాహరణ. ప్రముఖ కథానాయకుడు, యువకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి అధిక స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన విజయ్‌ని అభినందిస్తున్నా.  

ప్రగతికి నాంది: మహేశ్‌బాబు 

కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పి, అద్భుతమైన విజయాన్ని అందుకున్న విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు! ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈరోజు నిదర్శనం. ఈ విజయం తమిళనాడులో అర్థవంతమైన ప్రగతికి నాంది పలుకుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. 

తమిళులకు అభినందనలు: విజయ్ దేవరకొండ 

గట్టిగా ఓటు వేసి, తమ కోసం తాము ఒక స్టాండ్ తీసుకున్న తమిళనాడు ప్రజలకు నా అభినందనలు. తమిళ ప్రజలకు, కొత్త సీఎంకు సంపద, సమిష్టి వృద్ధి కలగాలని కోరుకుంటున్నా. తమిళ రాజకీ యాల్లో ఈ కొత్త దశను, కొత్త ముఖాన్ని చూడటానికి ఉత్సాహంగా ఉన్నా. 

ఫలితాలు సినిమాను తలపిస్తున్నాయి: నాని

అభినందనలు విజయ్ సర్. మొదట సందేహించారు, ఆ తర్వాత పట్టాభిషేకం చేశారు. ఇది మా ఇంట్లో.. అంటే ఏపీలో పవన్‌కళ్యాణ్ విషయంలో జరిగింది. ఇప్పుడు మా పొరుగు ఇంట్లోనూ జరుగుతోంది. అండర్‌డాగ్ విజయం ఎప్పుడూ ఒక అద్భుతమైన సినిమాలా ఉంటుంది. అంచనాలను తలకిందులు చేస్తూ విజయం సాధించిన ఈ ఎన్నికల ఫలితాలు సినిమాను తలపిస్తున్నాయి. బహుశా ఇదేనేమో రాజకీయం అంటే. స్పష్టమైన మెజారిటీతో విజయ్‌ను తమిళ ప్రజలు గెలిపించారు. తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించిన తమిళనాడు ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా. 

విజయ్ కొత్త శకం: రష్మిక మందన్న 

అభినందనలు విజయ్ సర్!! మీరు విజయం సాధించడం నాకు చాలా సంతో షం ఉంది. తమిళ రాజకీయాల్లో మీరు ప్రారంభించిన కొత్త శకంలో మిమ్మల్ని చూడటానికి ఉత్సాహంగా ఉన్నా! ఆల్ ది వెరీ బెస్ట్ సర్!

ప్రజల మనిషి: రవితేజ  

విజయ్ ప్రజల మనిషి. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఇంతటి ప్రజాదరణ పొందడం మామూలు విషయం కాదు. ఈ కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా. 

నేను ముందే చెప్పా: శర్వానంద్ 

నేను ముందే చెప్పాను, ప్రయాణాలు కొన్ని పెద్ద లక్ష్యాల కోసం ఉద్దేశించబడ్డాయని. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన విజయ్‌కి   అభినందనలు. సిని మా నుంచి నాయకత్వం వరకు, మీరు మిలియన్ల మంది నమ్మకాన్ని గెలుచుకున్నారు. రాబోయే కాలంలో మీరు మరింత దృఢంగా ముందుకు సాగాలి. 

ఆ కిక్కే వేరు: సాయిదుర్గాతేజ్

విజిల్ పోడు..! విజయ్, ఇది ఒక సంచలన విజయం. ఇది మీ సంకల్పాన్ని, మీరు చేసిన కృషిని తెలియజేస్తోంది. ఒక నటుడు, ప్రజల దేవుడు.. అందరూ తప్పు అని నిరూపించి, ప్రజల ప్రేమతో గెలిచినప్పుడు ఆ కిక్కే వేరు. దక్షిణాదిలో ఇదొక ఆచారంగా మారిపోయింది. 

అచంచల ప్రేమకు నిదర్శనం: కాజల్ అగర్వాల్

నేను ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే. ఈ రోజు ప్రజలు అదే నమ్మకంతో మీకు సమాధానం ఇచ్చారు. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనం. తమిళనాడు ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుక. 

ప్రజాకాంక్ష రుజువైంది: వరలక్ష్మి శరత్‌కుమార్

తమిళనాడు రాష్ట్రంలో ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్పారు. అక్కడ దశాబ్దాలుగా ఎంతో మంది ఈ మార్పు కోసం ప్రయత్నించారు. కానీ, ప్రజలు ఎవరిని కోరుకుంటారో విజ యం వారినే వరిస్తుందని తాజా ఫలి తంతో మరోసారి రుజువైంది. తమిళ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు.