29-09-2025 04:50:18 PM
రూ.3.70 కోట్లతో రేగొండ బస్టాండ్ నిర్మాణం..
ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు భూమి పూజలు..
రేగొండ (విజయక్రాంతి): ప్రజల సౌకర్యమే ప్రజా ప్రభుత్వ సంక్షేమం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో రూ.3.70 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి రేగొండ మండలం కేంద్ర బిందువుగా ఉందని ఇక్కడి నుంచి ప్రజలు పరకాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుమట్ల పట్టణాలకు నిత్యం రవాణా చేస్తారని కానీ ప్రయాణికులకు బస్టాండ్ లేక చాలా అవస్థలు పడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రేగొండ ఆర్టిసి బస్టాండ్ నిర్మాణానికి రూ.3.70 కోట్లు, బస్టాండ్ రెస్టోరేషన్ కు రూ.90 లక్షలు, అలాగే చిట్యాల బస్టాండ్ నిర్మాణానికి రూ.50 లక్షలు నిధులు మంజూరు చేసి జీవో ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి ఇప్పటివరకు రూ.186 కోట్ల జీరో టిక్కెట్లు జారీ చేయగా ఆర్థిక శాఖ ఆర్టీసీకి రూ.6210 కోట్లు చెల్లించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉన్న ప్రభాకర్ కు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు, రేగొండ ఎమ్మార్వో శ్వేత రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప కాయల నరసయ్య, వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, నాయకులు ఎన్ ఎస్సార్ సంపత్ రావు, పిఎసిఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్ రావు, కోటంచ చైర్మన్ మల్కనూరి బిక్షపతి, రేగొండ టౌన్ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.