calender_icon.png 29 September, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమలులోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి

29-09-2025 04:47:07 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తుచా తప్పకుండా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, గ్రౌండింగ్ వంటివి చేయకూడదని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు పక్కగా పని చేయాలని అన్నారు.

అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులతో ఎలాంటి సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు నిర్వహించకూడదని, వారితో సమావేశాలలో పాల్గొనకూడదని చెప్పారు. ఇది వరకే ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు, అమలవుతున్న పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా అంతటా గ్రామపంచాయతీ, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. ప్రత్యేకించి ముఖ్యమైన తాగునీరు, వైద్యం వంటి అత్యవసర పనులు కొనసాగుతాయని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలు, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయి వరకు అధికారులు అందరూ సిబ్బంది ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తిగా స్పష్టత కలిగి ఉండాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున జిల్లా వ్యాప్తంగా ఎక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోయార్డింగులు, కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. గ్రామపంచాయతీ, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా వచ్చే సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు  కలెక్టర్ తెలిపారు. నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని, అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమం జరగదని, అందువలన జిల్లా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, వినతులను సమర్పించేందుకు సోమవారం జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డిఓలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, జిల్లా అధికారులు ఉన్నారు.