calender_icon.png 20 December, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది

20-12-2025 09:10:29 PM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత కేవలం న్యాయస్థానాలకు, న్యాయవాదులకు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్క పౌరునిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ స్పష్టం చేశారు. సమసమాజ స్థాపన, సమానత్వం, సామాజిక న్యాయం అనే లక్ష్యాలతో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఆయన పిలుపు నిచ్చారు.

శనివారం కొత్తగూడెం క్లబ్‌లో ఐఎల్పీఏ జాతీయ అధ్యక్షురాలు కె.సుజాత చౌదంతి అధ్యక్షతన నిర్వహించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) తెలంగాణ రాష్ట్ర ఐదవ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం మాత్రమే కాకుండా, దేశ ప్రజల జీవన విధానాన్ని దిశానిర్దేశం చేసే మహత్తర గ్రంథమని అన్నారు. సమాన హక్కులు, మానవగౌరవం, స్వేచ్ఛ,సోదరభావం వంటి విలువలను ప్రజలందరికీ అందించాలనే సంకల్పంతో రాజ్యాంగం రచించబడిందని వివరించారు.

రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక హక్కులు, దిశానిర్దేశక సూత్రాలు సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పునాదులుగా నిలుస్తున్నాయని,వాటిని కాపాడే బాధ్యత న్యాయవ్యవస్థతో పాటు సమాజంలోని ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా న్యాయవాదులు  రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. నేటి కాలంలో రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని,ఈ దిశగా ఇటువంటి రాష్ట్ర స్థాయి మహాసభలు న్యాయవాదుల మధ్య చర్చకు, ఆలోచనలకు, మార్గదర్శకత్వానికి దోహదపడతాయని జిల్లా జడ్జి తెలిపారు.

న్యాయవృత్తిలో నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు ఈ తరహా సదస్సులు ఉపయోగపడతాయని అన్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రాజ్యాంగం, న్యాయస్థానాల విధులు, చట్టాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో న్యాయవాదులు గ్రామస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని సూచించారు. అలా చేసినప్పుడే నిజమైన న్యాయసమాజం ఆవిర్భవిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచిన ఐఎల్పీఏ తెలంగాణ యూనిట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, న్యాయవాదుల హక్కులు, సమస్యలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో కూడా ఐఎల్పీఏ మరిన్ని సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టి న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సరిత,న్యాయమూర్తులు కిరణ్ కుమార్ కవిత, రాజేందర్, సుచరిత, రవికుమార్, వినయ్ కుమార్, సూరీరెడ్డి ఎం.రాజమల్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులులక్కినేని సత్యనారాయణ ఐఎల్పీఏ తెలంగాణ బాధ్యులు శాంసన్, దేవరాజ్ గౌడ్, లక్ష్మీదేవి, సైనీ నాగేందర్, అదనం కామర్ తదితరులు పాల్గొన్నారు.