20-12-2025 09:51:29 PM
పాల్గొన్న ఉద్యోగులకు సర్టిఫికెట్లు అందజేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (డీఎం సీఆర్ హెచ్‌ఆర్‌డీ) ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ సమన్వయ సమస్త సహకారంతో సమాచార హక్కు చట్టంపై రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి సమాచార హక్కు చట్టం యొక్క లక్ష్యాలు, ప్రాధాన్యత, చట్టంలోని ముఖ్య నిబంధనలు, పౌరుల హక్కులు, ప్రభుత్వ అధికారుల బాధ్యతలు, సమాచారాన్ని అందించడంలో పాటించాల్సిన విధానాలు, అప్పీల్స్ ప్రక్రియ తదితర అంశాలపై నిపుణులచే సమగ్ర అవగాహన కల్పించారు.
శిక్షణ కార్యక్రమం రెండో రోజు సందర్భంగా సమాచార హక్కు చట్టం అవసరత, పారదర్శకత, బాధ్యతాయుత పాలనలో ఆర్‌టీఐ చట్టం పాత్రపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు చట్టం అత్యంత కీలకమని, ప్రజలకు సమయానుకూలంగా సరైన సమాచారం అందించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం అన్నారు. పాల్గొన్న ఉద్యోగులకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ మేనేజర్ ఆనంద్ కుమార్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కొండలరావు, శిక్షకులు మోహన్ కృష్ణతో పాటు వివిధ శాఖలకు చెందిన మొత్తం 82 మంది ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.