calender_icon.png 21 December, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లమల్ల అడవుల విశిష్టతలపై జ్ఞానేష్ కుమార్ ఆరా

20-12-2025 09:48:45 PM

జాతీయ ఎన్నికల ప్రధాన అధికారికి అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ జ్ఞాపికను అందజేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమల్ల అడవుల్లో ఉన్న అపారమైన సహజ వనరులు, జలపాతాలు, వన్యమృగ సంపద, శైవ క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ఎకో టూరిజం అవకాశాలపై జాతీయ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న జ్ఞానేష్ కుమార్, శ్రీశైలం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూరులోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్‌లో కాసేపు విరామం తీసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని సహజ అటవీ సంపదపై స్థానిక అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో పాటు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర పాల్గొన్నారు. నల్లమల్ల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలు, అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలపై అధికారులు జాతీయ ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు.  జిల్లాలో బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటరు జాబితాల శుద్ధి, ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న ముందస్తు ఏర్పాట్లపై కూడా కలెక్టర్ వివరించారు. పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

నల్లమల్ల అమ్రాబాద్ ఎకో ఫారెస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక జ్ఞాపికను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జాతీయ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, నల్లమల్ల అటవీ ప్రాంతాల సహజ అందం, జీవ వైవిధ్యం, పర్యాటక అవకాశాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ పర్యటన తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంటూ, సమన్వయంతో పని చేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు అటవీ శాఖ అధికారులకు ఆయన అభినందించారు.