20-12-2025 10:17:47 PM
ప్రముఖ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సంస్థలలో ఒకటైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఐఈటి) 9వ ఎడిషన్ జాతీయ స్కాలర్ షిప్ అవార్డును చెన్నైలోని కెసిజి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థిని రితికా ఎస్ కె గెలుచుకుంది. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు అత్యంత ప్రతిష్టాత్మక గౌరవాలలో ఒకటిగా భావిస్తారు. విద్యాపరమైన నైపుణ్యం, ఆవిష్కరణ, నాయకత్వం, సామాజిక ప్రభావానికి సంబంధించిన నిబద్ధతను అంచనా వేసేక్రమంలో దరఖాస్తులను ఆహ్వానిస్తారు. దేశవ్యాప్తంగా 43,971 దరఖాస్తుల నుండి రితికా అగ్రస్థానంలో నిలిచింది. ఆమె సోలార్-పవర్డ్ హెల్త్ కేర్ కియోస్క్ లో నేషనల్ ఫైనల్స్ ను గెలుచుకుంది.
రితికకు గౌరవ ఐఇటి సభ్యత్వంతో పాటు 3 లక్షల రూపాయల స్కాలర్ షిప్ లభించింది. తొలి రన్నరప్ గా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీకి చెందిన వాన్సికా జవార్, రెండో రన్నరప్ గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన ఖుషీ మల్హోత్రా నిలిచారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.10 లక్షల స్కాలర్ షిప్ ప్రైజ్ మనీని అందజేశారు. ఈ కార్యక్రమం చరిత్రలో తొలిసారిగా మొత్తం ఐదుగురు జాతీయ ఫైనలిస్టులు మహిళలే నిలిచారు. ఐఇటి ఇండియా స్కాలర్ షిప్ అవార్డు సాంకేతిక సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, నాయకత్వం , బలమైన ఉద్దేశ్యాన్ని ప్రదర్శించే యువ ఇంజనీర్లను వెలికి తీస్తోందని ఐఇటి ఇండియా స్కాలర్ షిప్ అడ్వైజరీ కమిటీ ఛైర్ ప్రొఫెసర్ అభిజిత్ చక్రవర్తి అన్నారు.