calender_icon.png 25 May, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

01-05-2025 08:02:17 PM

మంథనిలో 410 ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు..

మంథని (విజయక్రాంతి): మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు(State IT Minister Duddilla Sridhar Babu) అన్నారు. గురువారం మంత్రి శ్రీధర్ బాబు మంథని పట్టణంలో జిల్లా  కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha), అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి విస్తృతంగా పర్యటించారు. మంథని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శ్రీపాద కుట్టు మిషన్ కేంద్రం, ఇందిరా మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన 2.5 లక్షల విలువ గల మొబైల్ క్యాంటీన్, మార్కెట్ ఏరియాలో 5 లక్షల విలువగల నైనిక నైటీస్ & ఫ్యాషన్ వేర్ మ్యాచింగ్ సెంటర్ మంత్రి ప్రారంభించారు.

పాత పాల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలం పరిశీలించారు. మొబైల్ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి అధికారులతో కలిసి టిఫిన్ చేసి చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మహిళలకు ఆదాయం మార్గాలు పెరగాలి, వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలచే కుట్టు మిషన్ కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్, వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు. 

మంథని పట్టణంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి శ్రీపాద కుట్టు మిషన్ కేంద్రం ద్వారా 10 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందని మంత్రి తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రయత్నంతో మంథనిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళ సోదరీమణులు వ్యాపార విస్తరణలో ఎటువంటి కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. మంథని పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలకు మొదటి జాబితాలో 410 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఇండ్ల స్థలం లేని వారికి కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వ స్థలం గుర్తించే  కార్యక్రమం కలెక్టర్, ఆర్డిఓ ఆధ్వర్యంలో జరుగుతుందని, ప్రజలు ఓపికతో ఉండాలని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి పేర్కొన్నారు. 

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమార స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రూ రమాదేవి, నాయకులు శశిభూషణ్ కాచే, ముసుకుల సురేందర్ రెడ్డి, ఒడ్నాల శ్రీనివాస్, కుడుదుల వెంకన్న, లింగయ్య యాదవ్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.