calender_icon.png 25 May, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ ఇంగ్లాండ్ వేధింపులపై దర్యాప్తు చేయాలి.. సబితా ఇంద్రారెడ్డి డిమాండ్

25-05-2025 09:50:22 AM

హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ(Miss England Milla Magee) సంచలన వ్యాఖ్యలపై మాజీ మహిళా మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(BRS MLA Sabitha Indra Reddy) స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్(Congress Govt) ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మండిపడ్డారు. హైదరాబాదులో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలపై.. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మధ్య వయసు ఉన్న పురుషులను ఆనందపెట్టాలని తమపై ఒత్తిడి తీసుకువచ్చారని తమను వేశ్య లాగా చూశారంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పోటీల నుంచి మధ్యలోనే తప్పుకుని స్వదేశానికి వెళ్ళిపోయారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనలు జరగడం, అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినప్పుడే తెరపైకి రావడం ప్రభుత్వ తీరుపై,  నిర్వాహకుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 

చాలా గ్రాండ్‌గా ఈ వేడుకలు నిర్వహిస్తాం, పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తాం.. ఈ పోటీలతో పెట్టుబడులు వస్తాయి యువత ఉద్యోగాలు వస్తాయి అంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మిస్ ఇంగ్లాండ్ మిల్లా  మాగీ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది కేవలం నిర్వాహకులపై చేసిన ఆరోపణ కాదన్న ఆమె మన రాష్ట్ర రాజధానిలో ఈ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్ర ప్రతిష్టకు, మన దేశ పరువు, ప్రతిష్టలకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు.

దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని కోరారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన యువతులను వేధించింది ఎవరు..? ఆ వేధింపులకు కారణమైంది ఎవరు?, ఆ వ్యక్తులు ఎవరు..? అని సబితా ప్రశ్నించారు.  ఈ అంశాలన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ అంశంపై తక్షణమే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర, దేశ పరువు ప్రతిష్టలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ దేశాల నుంచి పోటీల కోసం వచ్చిన యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన వారు వారితో అసభ్యకరమైన పనులు చేయించాలని ప్రయత్నించిన వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ విషయం పైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె పేర్కొన్నారు.