17-12-2025 12:00:00 AM
ధీరన్ కొడారి :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యకు తమ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యతను ఇస్తుందో తెలియజేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం ఓయూకు వెయ్యికోట్లు మంజూరు చేసిన తీరు అభినందనీయం. సమాజంలో అసమానతలు తొలగిపోవాలంటే విద్య ఎంతో అవసరం అంటున్న వీరి పాలనలోనే గురుకుల పాఠశాలల నిర్వహణపై కొండంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. అన్నం పరఃబ్రహ్మ స్వరూపం అంటారు.
అలాంటి పరిశుభ్రమైన ఆహా రం కోసం పరితపిస్తూ గురుకుల విద్యార్థులు రోడ్డెకుతున్న పరిస్థితి నేడు రాష్ట్రం లో అంతటా కనిపిస్తూనే ఉన్నది. పాడైన అన్నం వడ్డిస్తున్నారంటూ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థులు స్వయంగా నిరసన తెలియజేయడం, ఇందుకు విశ్వవిద్యాలయాలు సైతం మినహాయింపు కాదని తెలిపే సంఘటన ఇది.
అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు కనీస సౌకర్యాలు సైతం లేవని, వెంటనే మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, ప్లకార్డులతో గంటల తరబడి నిరసన తెలియజేయడం కూడా నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడమే అవుతుంది.
ప్రభుత్వ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తూ, పట్టెడన్నం కోసం పరితపిస్తున్న విద్యార్థుల బాధ లు వర్ణణాతీతం. నాణ్యమైన విద్యభోదన సంగతి అంటుంచి, సరైన పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అవస్థలు పడుతూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రుల పాలవుతున్నారు.
చిత్తశుద్ది ఏదీ?
పేదరికానికి దూరంగా తమ భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవడానికి నిరుపేద విద్యార్థులు ఎందరో ప్రభుత్వ ఉచిత విద్యకోసం ఆశ్రమ, గురుకుల పాఠశాలలను ఆశ్రయించి జీవితంలో గొప్పగా ఎదగాలని ఆశించడం సహజం. అయితే ఆ కలలతో పాఠశాలల్లో చేరి అనారోగ్యం పాలవుతున్న వారి అవస్థలు చూస్తుంటే, గురు కుల విద్య పట్ల, అందిస్తున్న మౌలిక సదుపాయాల పట్ల పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నిం చాల్సిన అవసరం ఏర్పడింది.
మూడొంతుల అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల వ్యవస్థ నిర్వాహణ ఎంత దయనీయంగా ఉందో మాటల్లో చెప్పలేని స్థితి. అందుకు గతంలో జరిగిన చాలా ఉదంతాలే దీనికి ఉదాహరణ. మెనూ పాటించడం లేదని, పురుగుల అన్నం వడ్డిస్తున్నారని, తమ గోడు వినే వారు లేరని విద్యార్థులు నేరు గా జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యలు పరిష్కరించాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కిన తీరు సమాజాన్ని ఆలోచింపజేసింది.
పర్యవేక్షణ లోపం వల్ల సరైన భోజనం కూడా అందక మునుపెన్నడూ చూడని విధంగా కల్తీ ఆహారంతో కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి అనారోగ్య సమస్యలతో వందలాది మంది విద్యార్థులు ఆసు పత్రుల పాలవుతుండటం హృదయాలను కలచివేస్తుంది.
సమస్యల వలయం..
గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాల కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఉదయం కిచిడీ తిని 31 మంది బాలికలు అశ్వస్థతకు గురికావడం ఘటన కావొచ్చు.. అదే జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విషం కలిపిన నీళ్లు తాగి 11 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురికావడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పొచ్చు.
అదే విధంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కిచిడీ తిని 37 మంది విద్యార్థినిలు కడుపునొప్పి, వాంతులు, ఆయాసంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడం మరిచిపోలేము. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలోని పిల్లలు రాత్రి భోజనం చేసి తీవ్ర అస్వస్థతకు గురి కావడం, నాగర్ కర్నూల్‌లోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో పెరుగు తినడం వల్ల 111మంది బాలికలు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరడం,
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూరు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం, కొద్దిరోజులక్రితం జోగు లాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ ఎస్టీ బాలుర వసతిగృహంలో ఉదయం ఆల్ఫాహారంగా అందించిన నాసిరకం ఉప్మా తిని 14 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవ్వడం చూస్తుంటే గురుకుల పాఠశాలల్లో చదువు కన్నా సమస్యలే ఎక్కువగా తిష్ట వేసినట్లుగా అనిపిస్తున్నది.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల హాస్టల్ భవనంకూలి ముగ్గురు విద్యార్థులు గాయపడటం, ప్రాణభయంతో విద్యార్థులు కాలం వెళ్లదీయడం కలవరానికి గురి చేసింది. మరి ఇన్ని సమస్యలున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయం.
ఎన్‌హెచ్‌ఆర్సీ ఆందోళన..
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, మైనార్టీ శాఖలు సుమారు 1023 గురుకులాలను నడుపు తున్నాయి. వీటికి తోడు మోడల్ స్కూల్స్ 194, కెజీబీవీ పాఠశాలలు 495 అదనమని చెప్పొ చ్చు. వీటిలో సుమారు ఆరు లక్షల యాభై వేల మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. వీటితో పాటు 33 జిల్లాల్లో 41,648 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దాదాపు 66,38,007 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
వీరిలో మూడొంతుల మంది విద్యార్థులు మౌళిక సదుపాయాలకు దూరంగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మెనూ పాటించకపోవడం, ఇష్టారీతిన నాసిరకం ఆహా రం అందించడం, నిర్వాహకులు వంట తయారీలో సరైన పద్ధతులు పాటించకపోవడం వంటి వివిధ కారణాలవల్ల గతంలో సాక్షాత్తు జాతీయ మానవ హక్కుల కమీషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) గురుకులాల్లో 48 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయని, 886 ఫుడ్ పాయిజాన్ కేసులు నమోదయ్యాయని తెలపడం కలవరపాటుకు గురి చేసే విషయం.
నిజానికి గురు కుల విద్యార్థుల మరణాలు ఇప్పటివరకు దాదాపుగా 100కి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజాన్ ఘటనలు నిత్యకృతమైపోయాయి. సరైన సదుపాయాలు కల్పించక పోవడం, తలుపులు, కిటికీలు, సరిగా ఉండకపోవడం, దీనికి తోడు వర్షాకాలంలో నీరు పాఠశాల పరిసరాల్లో నిల్వ ఉండటం వల్ల దోమలు, ఈగలు, విషకీటకాలకు ఆవాసంగా మారి విద్యార్థులు విష జ్వరాల బారిన పడుతుండడం ఆందోళన కలిగించే అంశం.
త్రికరణ శుద్ధితో..
కొండనాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడినట్టు.. యంగ్ ఇండియా స్కూల్స్ పై శ్రద్ద పెడుతున్న ప్రభుత్వం.. అదే సమయంలో విద్యలో అద్భుతాలు సృష్టిస్తున్న గురుకుల వ్యవస్థను నీరు గార్చడం ఏమా త్రం మంచిది కాదు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం వైపు పరుగులు పెట్టడం, పాఠశాల, కళాశాల, వృత్తి నైపుణ్యం కోర్సుల్లో మార్పులు తేవడానికి ప్రయత్నాలు చేపట్టడం ఆహ్వానించదగ్గ పరిణా మమే.
కానీ గురుకులాల విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాలతో కూడిన ప్రక్షాళనకు కూడా అంతే వేగంగా నడుం బిగిం చాలి. విద్యార్థుల భవితతో పరిహాసం ఎవరికీ మంచిది కాదు. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి, జీవితం విద్యతోనే అని మనకు తెలుసు. ఎప్పటికైనా గురుకుల విద్యావ్యవస్థలో సమూల మార్పులు రాకపోతాయా, తమ భవితకు పునాదిరాళ్లుగా మిగలకపోతాయా అనే ఆశావాదంతో కష్టనష్టాలకు ఓర్చుకొని పేద విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు.
దీనిలో భాగంగా ప్రభుత్వం వెంటనే గురుకుల పాఠశాలల నిర్వహణపై త్రికరణ శుద్ధిగా ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రక్షాళన దిశగా అడుగులు వేయాల్సిన అవసరముంది. రాబోయే విద్యాసం వత్సరం నాటికి గురుకులాల్లో సకల సదుపాయాలు కల్పించి, విద్యార్థుల మదిలో ఆత్మ విశ్వాసం నింపాల్సిన అవసరం ఎం తైనా ఉంది.
వ్యాసకర్త సెల్: 8008200664