14-09-2025 07:02:01 PM
నకిరేకల్,(విజయక్రాంతి): కల్లుగీత వృత్తిలో ఉపాధి ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రామన్నపేట నిర్వహించిన మండల 3వ మహాసభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై 5 లక్షల కుటుంబాల ఆధారపడి జీవిస్తున్నాయన్నారు.వారి ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు 5 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తరతరాల నుండి కల్లుగీత వృత్తి చేస్తూ ప్రభుత్వానికి వేలాది కోట్ల పన్నులు చెల్లించారు కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గీత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని పేర్కొన్నారు.. అతి ప్రమాదకరమైన కల్లుగీత వృత్తి చేస్తున్న గీత కార్మికులందరికీ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలేకుండా ప్రమాదాలు నివారించుటకై సేఫ్టీ కిట్లు అందించాలని. స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు.