14-09-2025 07:05:30 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తు వద్దు
కరీంనగర్లో 25 స్థానాల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వండి
అధినేత అసదుద్దీన్ ఒవైసీకి గులాం అహ్మద్ హుస్సేన్ విజ్ఞప్తి
కరీంనగర్,(విజయక్రాంతి): కార్యకర్తలు అందర్నీ సమిష్టిగా కలుపుకుపోతూ, వర్గ విభేదాలను పక్కన పెట్టి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఎంఐఎం పార్టీ జెండాను ఎగురవేస్తామని, సర్పంచ్ ,జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి సత్తా చాటుతామని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఎంఐఎం అధినేత భారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీకి భరోసా ఇచ్చారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ ఎంఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీ నాయకులతో ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ, ముఖాముఖిగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరపున గులాం అహ్మద్ హుస్సేన్ మాత్రమే సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తువద్దని గతంలో బిఆర్ఎస్ పార్టీతో స్నేహపూర్వక పోటీ వల్ల కరీంనగర్లో ఎంఐఎం పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. 7సీట్లకు డబుల్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్ల నీరుగారిపోయిందన్నారు. కరీంనగర్ నగరంలో 66 డివిజన్లకు గాను 38 డివిజన్లలో కమిటీలు వేశామని, 25డివిజన్లలో ఎంఐఎం పార్టీ బలంగా ఉందని, ఈ25 డివిజన్లలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నందున పోటీ చేసేందుకు అనుమతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సర్పంచ్, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో సైతం ఎంఐఎం పార్టీ పోటీ చేసి సత్తా చాటుతుందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, రామగుండం, పెద్దపల్లిలో సైతం ఎంఐఎం పార్టీ పోటీ చేసి పెద్ద ఎత్తున విజయం సాధించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఎంఐ పార్టీలో చేరే వారి కోసం అందరికీ తలుపులు తెరిచే ఉంచామన్నారు. ఒకరిద్దరూ అసంతృప్తిగా ఉండడం ఏరాజకీయ పార్టీలోనైనా సహజమని, వారి కోసం పార్టీని బలోపేతం చేయకుండా ఉంటామా అని ప్రశ్నించారు. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం, ఈద్గా భూమి, ఖబ్రస్థాన్ల భూముల సాధన కోసం ఎంఐఎం ఖచ్చితంగా పోరాటం చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చివరగా అధ్యక్ష ఉపన్యాసం చేశారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే సుప్రీం అని, పార్టీ బలోపేతం కోసం అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలకు యావాన్మంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు కట్టుబడి వుండాలని ఎంఐఎం అధినేత జిల్లా ఎంఐఎం శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైందని, పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ కు ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ, గజ మాలతో ఆత్మీయంగా సన్మానించారు.