calender_icon.png 23 November, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్రలు, చెట్లే.. కరెంట్ పోళ్లు

10-02-2025 01:12:57 AM

విద్యుత్ శాఖలో వసూళ్ల పర్వం 

  1. ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.50వేలు వసూలు చేసిన లైన్‌మన్
  2. 25 కేవీ కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌కు..రైతులు చెల్లించాల్సింది రూ. 25 వేలే 
  3. ఏడాదిన్నర కాలమైనా పనులు పూర్తిచేయక ఇబ్బందులు
  4. ఫిర్యాదు చేసినా పట్టించుకోని విద్యుత్‌శాఖ అధికారులు 
  5. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ రైతుల ఆవేదన

(సుంచు అశోక్) :

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ప్రభుత్వా లు మారుతున్నాయి.. పాలకులూ మారుతున్నారు. అవినీతి లేని, పారదర్శకమైన పాలన అందిస్తామని, రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పాల కులు చెప్పిన మాటలను కొందరు అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు.

ఈక్రమంలో విద్యుత్ శాఖలో వసూళ్ల పర్వం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ముడుపులు ఇచ్చినా పనులు మాత్రం ముందుకుసాగని పరిస్థితి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మం డలం ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన రైతులు సంబగ మల్లయ్య, తుప్పతి బీరయ్య, కడారి రాజమల్లు, తుప్పతి సింగయ్య  కలిసి 25 కేవీ  కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు వ్యవసాయ బోరుబావులకు కరెంట్ కనెక్షన్ల కోసం డీడీ తీయడానికి  15 నెలల కింద ఆ గ్రామానికి చెందిన లైన్‌మన్ మహిపాల్‌రెడ్డికి రూ.50వేలు చెల్లించామని ‘విజయ క్రాంతి’తో చెప్పారు.

అయితే కొన్ని నెలల తర్వాత కేవలం ట్రాన్స్‌ఫార్మర్ తీసుకొచ్చి గద్దెపై ఏర్పాటు చేసి.. కనెక్షన్ మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారు. అదే గ్రామానికి చెంది న మరో నలుగురు చిన్న ఎల్లం, రాజేందర్, బద్ది పోచయ్య, గొడుగుపల్లి చంద్రయ్య కూడా ఐదేళ్ల కింద కొత్త ట్రాన్స్‌ఫార్మర్, వ్యవసాయ బోరుబావులకుగాను ఆరు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీలు తీశారు.

ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినా సరిపోను కరెంట్ పోళ్లు బిగించలేదని రైతులు చెబుతున్నారు. దీంతో  కర్రలు నాటుకోవడం లేదంటే చెట్ల మీద నుంచి కరెంట్ వైర్లను తీసుకెళ్తున్నామని రైతులు చెబుతున్నారు. ఈవిషయాన్ని పైస్థా యి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని సదరు రైతులు వాపోతున్నారు. ఇలాంటి సమస్య ఒక ఇందుప్రియాల్ గ్రామసమస్య మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామాల్లో రైతులు ఇలా ఇబ్బందు లు పడుతూనే ఉన్నారన్నారు.    

కాగా,  వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్‌కుగాను 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సంబంధిత శాఖ ఏర్పాటు చేస్తుంది. రైతులు పెద్దమొత్తంలో ఖర్చులు భరించడం కష్టంగా ఉంటుందని భావించిన విద్యుత్ శాఖ.. రైతులకు తక్కువ ఖర్చుతోనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తోంది.

నలుగురు రైతులు కలిసి రూ.25 వేలు డీడీ రూపంలో చెల్లిస్తే మిగతా డబ్బులను డిపార్ట్‌మెంటే భరించి ట్రాన్స్‌ఫార్మర్,  కేబుల్, కరెంట్ స్థంభాలు, గద్దె నిర్మా ణంతో దానికి సంబంధించిన పరికరాలను సమకూర్చి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి రైతుల బోరుబావులకు విద్యుత్ కనెక్షన్లను ఇస్తుంది.

అయితే క్షేత్రస్థాయిలోని విద్యుత్ సిబ్బంది మాత్రం రైతుల అవసరాన్ని అసరా చేసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూ లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కు వ మొత్తంలో డబ్బులు తీసుకోవడమే కాకుండా.. వాటిని సొంతానికి వాడుకుని రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినా రైతుల వ్యవసాయ బావుల వరకు సరిపోను కరెంట్ పోల్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు చెబు తున్నారు. ఇలాంటి సమస్యలపై  సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  

పైసలు ఇస్తేనే పనులు..

గ్రామంలో పైసలు ఇస్తేనే విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నారు. నేను ట్రాన్‌ఫార్మ ర్, వ్యవసాయ బోరు బావికి విద్యుత్ కనెక్షన్ కోసం గతేడాది డబ్బులు ఇచ్చాం.. అయినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు.  మూడు నెలల క్రితం ట్రాన్స్ ఫార్మర్ తెచ్చి గద్దెపై పెట్టారు. పైసలు ఇస్తేనే విద్యుత్ స్థంభాలు బిగిస్తామని లైన్‌మన్ మహిపాల్‌రెడ్డి చెబుతున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మ ర్, విద్యుత్ కనెక్షన్ల కోసం రూ. 70 వేలు అడిగితే.. నలుగురు రైతులం కలిసి రూ.50 వేలు ఇచ్చాం. అయినా కనెక్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 

సంబగ మల్లయ్య, రైతు 

విద్యుత్ స్థంభాలు బిగించలేదు.. 

కరెంట్ కనెక్షన్ కోసం డీడీలు చెల్లిం చి సంవత్సరాలు గడుస్తున్నా విద్యుత్ అధికారులు నిర్ల క్ష్యం వహిస్తున్నారు. కరెంట్ కనెక్షన్ లేక ఇబ్బందులు పడుతు న్నాం. పైసలు ఇచ్చిన వారికి మాత్రమే పను లు చేస్తున్నారు. ఎందుకు చేయడం లేదని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో.. చెప్పుకో అంటున్నారు. రైతుల వద్ద డబ్బులు వసూ లు చేస్తున్న అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 

 సంబగ ఎల్లయ్య, రైతు 

డబ్బుల కోసం పీడిస్తున్న లైన్‌మన్..

ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ కనెక్షన్ల కోసం 15 నెలల కింద లైన్‌మన్ మా వద్ద డీడీల కోసమ ని రూ.50 వేలు తీసుకున్నాడు. తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌ను గద్దె పై పెట్టినా కనెక్షన్ ఇవ్వలేదు. స్థంభాల కోసం మళ్లీ డబ్బులు అడుగుతున్నాడు. ఇచ్చిన స్థంభాలు దూరంగా పాతడంతో.. వైర్లు వేలాడుతున్నాయి. లైన్‌మన్‌పై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలి. 

 చాకలి ఎల్లం, రైతు