05-07-2025 08:08:00 PM
దొంగిలించిన సామాగ్రిని రైతు
వేదిక చేర్చిన దుండగులు
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురుజాల రైతు వేదికలో జరిగిన చోరీ సామాగ్రీ అనూహ్యంగా తిరిగి చేరుకుంది. గురజాల రైతువేదిక కార్యాలయంలో ఈ నెల 4 తారీఖు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరిచేసి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ ను ఎత్తుకెళ్ళిన విషయం తెలిసిందే. చోరీకి గురైన సామాగ్రి అదే రోజు రాత్రి గురజాల రైతువేదిక కార్యాలయం ముందు ప్రత్యక్షo కావడం చర్చనీయాంశoగా మారింది.
దొంగతనం ఎవరు చేశారు. తిరిగి సామాగ్రిని రైతువేదికకు ఎవరు చేర్చారు అనేదానిపై ఆసక్తికరమైన చర్చజరుగుతోంది. రైతు వేదికకు చేరిన సామాగ్రి సమాచారం తెలిసిన బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, గురజాల ఎస్సై రమేష్, బెల్లంపల్లి వ్యవసాయ అధికారులు గురజాల రైతువేదిక వద్దకు వెళ్లారు. బయట వదిలేసిన వీసీ యూనిట్ సామాగ్రిని పరిశీలించారు. దొంగతనానికి గురైన వీసీ యూనిట్ సామాగ్రి తిరిగి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దొంగతనం చేసిన నిందితులు భయపడే చోరీ వస్తువులను తిరిగి అప్పగించారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రైతువేదికలో జరిగిన దొంగతనం ఆపై చోరీ చేసిన వస్తువులు తిరిగి రావడం ఎవరి పని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా దొంగలు అయితే వస్తువులను తిరిగి అప్పగించడం ఏంటనే ప్రశ్న వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో ఇది దొంగల పని కాదనేది అర్థమవుతుంది. అయితే ఈ పని ఎవరు చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ అయిన సామాగ్రి తిరిగి అప్పగించడంతోటే సరిపోదని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.