05-07-2025 08:08:42 PM
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తింపు..
వెంటనే ఆసుపత్రికి తరలింపు.. దక్కిన ప్రాణాలు..
కానిస్టేబుల్ ను ప్రశంసించిన ఉన్నతాధికారులు..
తలకొండపల్లి: ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన యువకుడిని పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించి ప్రాణాలు కాపాడిన సంఘటన శనివారం తలకొండపల్లి మండలం(Talakondapally Mandal)లో చోటుచేసుకుంది. తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్(SI Srikanth) చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మెదక్ పల్లి గ్రామానికి చెందిన దర్వుల మచ్చందర్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో గబరా పడిన కుటుంబ సభ్యులు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్సై శ్రీకాంత్ ఆదేశాల మేరకు క్రైం బ్రాంచ్ కానిస్టేబుల్ జాషువా రంగంలోకి దిగారు.
మచ్చందర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకి గుర్తించారు. అప్పటికే మచ్చందర్ పురుగుల మందు తాగి ఉన్నాడు. నోటిలో నుండి నురగలు రావడం గమనించి వెంటనే కుటుంబ సభ్యుల సహకారంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి డాక్టర్లు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. పోలీసులు వెంటనే స్పందించడంతో తమ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడని వారు క్రుతజ్ఞతలు తెలిపారు. యువకుని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ జాషువాను ఆమనగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకి రాంరెడ్డి, తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్, గ్రామస్తులు అభినందించారు.