26-11-2025 08:14:11 PM
* ధాన్యం నిలువలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
* జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డా,ఏ.మరియాదాస్
గరిడేపల్లి (విజయక్రాంతి): రైతులు తమ పంటలను గిడ్డంగుల్లో శాస్త్రీయ పద్ధతుల్లో నిల్వచేస్తే గణనీయమైన లాభాలు పొందవచ్చని, రైతులు ధాన్యం నిలువలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డా,ఏ.మరియాదాస్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో డబ్ల్యూ.డి.ఆర్.ఏ(వేర్ హౌజ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ యాక్ట్), ఎన్.డబ్ల్యు.ఆర్ (నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్) పై రైతులు, వ్యాపారులు, పప్పు మిల్ యజమానులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ అంటే ఏమిటి, దాని ద్వారా రైతులు ఎలా లబ్ది పొందొచ్చు అనే విషయాలను తెలియచేశారు. రైతులు ధాన్యం నిల్వలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆహార ధాన్యాలను కాపాడుకోవచ్చునని లేకుంటే 10 నుండి 30 శాతం దాన్యం చీడ పురుగులు, ఎలుకల వల్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు. ధాన్యం నిల్వపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. నిల్వ సమయంలో ఉపయోగించే హెర్మటిక్ బ్యాగ్ ల ఉపయోగాల గురించి తెలియజేశారు. డి ఆదర్శ్,కేవీకే సస్య రక్షణ శాస్త్రవేత్త మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ నేగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ ద్వారా గోదాములో నిలువ చేసుకోవడమే కాకుండా, నిలువచేసిన ధాన్యానికి లోన్ తీసుకునే అవకాశం రైతులకు ఉంటుందన్నారు.
ఈ రిసిప్ట్ ద్వారా ఆన్లైన్ (ఈ-ఎన్.ఏ.ఎం)లో కూడా రైతులు తమ ధాన్యాన్ని అమ్మకం అమ్ముకోవచ్చు అన్నారు.అనంతరం రైతులను నేరేడుచర్లలోనీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డంగుల సంస్థకు తీసుకెళ్లి ధాన్య నిలువ గురించి ప్రాక్టికల్ గా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డి ఆదర్శ్,ఏ కిరణ్,పి.అక్షిత్ సాయి,ఎన్ సుగంధి, వివిధ గ్రామాలకు చెందిన 50 మంది రైతులు పాల్గొన్నారు.