calender_icon.png 26 November, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధం

26-11-2025 07:57:36 PM

జిల్లాలో మొదటి విడతలో 160 గ్రామ పంచాయతీలలో 1,402 వార్డు స్థానాలకు నామినేషన్లు

ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

పాపన్నపేట (విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పాపన్నపేట, టేక్మాల్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడాతూ.. 27వ తేదీ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామ పంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలన్నారు. ఓటరు జాబితాను సైతం ప్రదర్శింపజేయాలని సూచించారు.

నామినేషన్ల ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 147 మంది  రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు. ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమ సంఖ్య నమోదు చేయాలని సూచించారు.  నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 160 గ్రామ పంచాయతీలలో 1,402 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.

ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు చేసిన హెల్ప్ డెస్క్ లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించామని వివరించారు. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, జోనల్, మండల ఆఫీసర్లు, ఎంసీసీ నోడల్ ఆఫీసర్లు, ఎఫ్ ఎస్ టీ, ఎస్ఎస్ టీ టీంలను నియమించి శిక్షణ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎఫ్ ఎస్ టీ, ఎస్ఎస్ టీ టీంలను విధులు నిర్వర్తిస్తున్నాయని తెలిపారు. అన్ని ఆర్ఓ కార్యాలయాల్లో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని, ఎన్నికకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో పెట్టాలని, నామినేషన్ల స్వీకరణ ఇతర వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో మొదటి రెండు, మూడో విడతలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.