బీభత్సం సృష్టించిన గాలివాన
- విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు
- అంధకారంలో గ్రామాలు
బూర్గంపాడు, మే10 (విజయక్రాంతి): గాలి వాన ఒక్కసారి భీభత్సవం సృష్టించింది. రేకుల షెడ్ల ఇండ్లు, చెట్లు నేలమట్టం చేసింది. మండలంలో శనివారం రాత్రి భారీగా వీచిన గాలులతో కురిసిన అకాల వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. మండలంలోని పినపాక పట్టి నగర్, టేకుల చెరువు తదితర గ్రామాల్లో రేకుల షెడ్ల ఇండ్లు భారీగా వీచిన గాలి వానకు లేచిపోయాయి. గాలి వాన బీభత్సానికి ఇండ్లపై రేకులు లేకుండా కొట్టుకుపోవడంతో నిలువ నీడ లేక బాధితులు నిరాశ్రయులయ్యారు.
గ్రామాల్లో చెట్లు వేర్లతో సహా పడిపోయి విద్యుత్ తీగలు, కరెంట్ పోల్స్ సైతం గాలి వేగానికి అక్కడక్కడ దెబ్బతినగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం భారీగా వీచిన గాలి ఒక్కసారిగా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రంతా చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయాన్నే ఏఈ ఉపేందర్ ఆధ్వర్యంలో లైన్మెన్లు జగన్మోహన్ రెడ్డి యుద్ధప్రాతిపదికన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు. నివాస గృహాలపై, రోడ్డు పక్క పడ్డ చెట్లను కటింగ్ మిషన్లతో తొలగించారు. గాలి వానకు నిరాశ్రయులైన ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పాల్వంచలో..
పాల్వంచ, మే 10 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో గత రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి స్థానిక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ వృక్షం నేలకొరిగింది. సుమారు 62 సంవత్సరాల క్రితం నాటి రావి, వేప చెట్లు కలిసి ఉన్న ఈ భారీ వృక్షానికి ఆలయ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. సంతానం లేని దంపతులు ఈ పవిత్ర వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మిక.
ఎంతో కాలం గా భక్తులు ఈ చెట్టును దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తున్నారు. అటువంటి వృ క్షం గాలివానకు కూలిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి ధుమారానికి ఈ భారీ వృక్షం ఒక్కసారిగా దేవస్థానం ప్రాంగణంలోని రేకుల ష్పే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో షేడ్ పాక్షికంగా ధ్వంసమైంది. అయితే, ఈ సంఘటన రాత్రి సమయంలో జరగడం, ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో ఆలయ అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆలయ సిబ్బంది కూలిన వృక్షాన్ని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.






