9 May, 2026 | 3:33 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

మళ్లీ క‘ర్నాటకం’!

15-05-2024 12:05 AM

దేశంలో తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టి అధికార గద్దె నెక్కడమే బీజేపీ పనిగా పెట్టుకున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మొదలైన ఈ ఫిరాయింపుల యజ్ఞాన్ని కమలనాథులు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో ‘మహా కూటమి’ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఎన్ని ఎత్తులు వేసిందో అందరికీ తెలిసిందే. ఫిరాయింపులకు పరాకాష్ఠగా నిలిచిన ఈ ఉదంతం యావద్దేశాన్ని నివ్వెర పరిచేలా చేసింది. అంతటితో బీజేపీ నేతల అధికార కాంక్ష ముగియలేదు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోట్ ప్రభుత్వాన్నీ పడగొట్టడానికి ప్రయత్నించింది కానీ, సఫలం కాలేదు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో దానికి శాశ్వతంగా తెరపడింది. అదే సమయంలో కర్నాటకలో అనూహ్యంగా బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల నేతృత్వంలో ఏడాది క్రితం కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయిన నాటినుంచీ అది కూలిపోతుందన్న మాటలు బీజేపీ నేతలనుంచి వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి ఈ కథనాలు రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించాయి. ఎన్నికల తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుం దంటూ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తాజాగా చేసిన వ్యాఖ్యలు  మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. కర్నాటకలో లోక్‌సభ ఎన్నికల ఘట్టం ముగిసి ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికల్లో కనీసం 20 స్థానాలు గెలుచుకుంటామని కాంగ్రెస్, బీజేపీ రెండూ ధీమాగా ఉన్నాయి. ఈ తరుణంలో షిండే చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సిద్ధరామయ్య సర్కార్‌ను కూల్చడానికి ‘మహారాష్ట్ర మోడల్’ను ప్రయోగిస్తామని  షిండే చేసిన వ్యాఖ్యలపై అటు సీఎం సిద్ధరామయ్య, ఇటు డిప్యూటీ సీఎం శివకుమార్‌లు ఇద్దరూ ఘాటుగా స్పందించారు. బీజేపీ పగటి కలలు కంటోందని  శివకుమార్ వ్యాఖ్యానించగా, మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయేవాళ్లు కాదని సీఎం ఘాటుగా  స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నమాట నిజమే కానీ అది ప్రభుత్వ పతనానికి దారి తీయదంటూ పార్టీలో అసమ్మతి నేతగా ముద్ర పడిన రాష్ట్రమంత్రి సతీశ్ జార్కిహోలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నిజానికి షిండే చేసిన వ్యాఖ్యలు కొత్తవేమీ కాదు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే పడిపోతుందని, సిద్ధరామయ్య, శివకుమార్‌ల మధ్య ఆధిపత్య పోరే దీనికి దారి తీస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు మొదటినుంచీ అంటూనే ఉన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం వారం రోజులపాటు సిద్ధరామయ్య, డీకే మధ్య సాగిన సిగపట్లు అందరికీ తెలిసిందే. అయితే, అధికార పంపిణీకి సంబంధించి ఢిల్లీలో ఇద్దరిమధ్యా ఒప్పందం కుదిరినందునే డీకే ఓ అడుగు వెనక్కి తగ్గారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఇరువురు నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ నేతలు మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తేవడమే కాదు, ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ, అమిత్ షా వంటి నేతల నోటకూడా ఈ మాటలు వినిపించాయి. తాజాగా ఏక్‌నాథ్ షిండే సతారాలో మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల తర్వాత పదుల సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పతనమవుతుందన్న షిండే వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీ నేతలు ఏకీభవించినా, ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించదని, దానికదే పడిపోతుందని చెప్పడం గమనార్హం.  మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం బీజేపీకి అంత సులువు కాదని మహారాష్ట్ర మాదిరిగా అంతటి సాహసం బీజేపీ చేయదని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమయినా షిండే వ్యాఖ్యల్లో నిజం ఎంతో తేలాలంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.