గోడలపై పోస్టర్లు వేస్తే కఠిన చర్యలు
మియాపూర్ డీసీ శ్రీనివాస్ హెచ్చరిక
శేరిలింగంపల్లి,ఆగస్టు 21 (విజయక్రాంతి): నగరంలో ప్రజా ప్రదేశాలు, గోడలపై అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు అతికించడంపై మియాపూర్ సర్కిల్ అధికారులు కఠిన వైఖరి అవలంబించారు. శుక్రవారం మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ డిజిటల్, ఆఫ్సెట్ ప్రింటర్లు, థియేటర్, మల్టీప్లెక్స్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా ప్రచార సామగ్రి ఏర్పాటు చేయడం వల్ల ప్రజా ఆస్తులు దెబ్బతినడమే కాకుండా,
పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. గోడలపై రాతలు, కటౌట్లు, ఫ్లెక్సీలు వేయడం ద్వారా నగర సౌందర్యం దెబ్బతింటోందని, దీనిని సహించబోమని హెచ్చరించారు.ప్రింటింగ్ సంస్థల యజమానులు తమ వద్ద ముద్రించే పోస్టర్లు, బ్యానర్లను అనుమతులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే థియేటర్లు, మల్టీప్లెక్స్లు తమ ప్రాంగణాల చుట్టుపక్కల పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని,
చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సంబంధిత యజమానుల నుంచి ప్రజా ప్రదేశాల్లో పోస్టర్లు ప్రదర్శించబోమని, ఇతరులతో ప్రదర్శింపజేయబోమని హామీ ఇస్తూ అండర్టేకింగ్లు, అఫిడవిట్లు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీసీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.పరిశుభ్రత, నగర సుందరీకరణ ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొంటూ, ఈ విషయంలో అందరూ సహకరించాలని అధికారులు కోరారు.






