calender_icon.png 20 August, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

20-08-2025 12:20:05 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ 

గరిడేపల్లి, ఆగస్ట్ 19 : ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలందించే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ హెచ్చరించారు. మండలంలో మంగళవారం ఆయన ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడి కేంద్రాలు,సహకార సంఘాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని పొనుగోడు సహకార సంఘం కార్యాలయంలో రికార్డులను పరిశీలించి కొన్ని విషయాలపై ఆరా తీశారు.

తదుపరి అంగన్వాడి కేంద్రం, జిల్లా పరిషత్,ప్రాథమికోన్నత పాఠశాలను,గరిడేపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. పొనుగోడు పాఠశాలలో వంటలు వండేందుకు కట్టెలు కాకుండా గ్యాస్ ను ఎందుకు వినియోగించటం లేదని అడిగి తెలుసుకున్నారు.అనంతరం గరిడేపల్లిలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సంబంధిత అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన నర్సరీని పరిశీలించి మొక్కలు నాటారు. తదుపరి గరిడేపల్లిలోని రెవిన్యూ కార్యాలయంలోకి వచ్చి సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో పనిచేస్తున్న అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో  పనిచేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. రైతులకు అందించే యూరియా విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కలెక్టర్ పర్యటనలో తాసిల్దార్ కారు ఏవో ప్రేతమ్ కుమార్ కాలుపై వెళ్లడంతో గాయమైంది. వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ బండ కవిత, ఎంపీడీవో సరోజ, మండల వ్యవసాయ అధికారి ప్రీతం కుమార్,ఎస్‌ఐ చలికంటి నరేష్,పంచాయతీ రాజ్ ఇరిగేషన్ ఏఈలు కీట్స్ కళ్యాణ్, సిద్ధార్థ,ఆర్.ఐ లు ప్రవీణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.