24-05-2025 01:38:38 AM
మహబూబాబాద్, మే 23 (విజయ క్రాంతి): గ్రామ పాలనాధికారుల నియామకం కోసం ఈనెల 25న నిర్వహించనున్న రాత పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
25న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. జిల్లాలో 152 మంది పరీక్షకు హాజరు కానున్నారని, పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో కి మొబైల్ ఫోన్లు ఎవరికి కూడా అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, ఇంటర్మీడియట్ అధికారి మదార్ తదితరులు పాల్గొన్నారు.