20-08-2025 01:00:06 AM
వనపర్తి జిల్లా ఇంచార్జి కలెక్టర్ విజయిందిర బోయి
వనపర్తి, ఆగస్టు 19 ( విజయక్రాంతి ) : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు పొంగి పొర్లుతున్నందున ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా ఇంచార్జి కలెక్టర్ విజయిందిర బోయి అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ సరళాసాగర్, రామన్ పాడ్ ప్రాజెక్టులను సందర్శించి సైఫాన్ గేటు ద్వారా, క్రస్ట్ గేటు ద్వారా ప్రవహిస్తున్న వరద ఉధృతిని పరిశీలించారు.
సరళాసాగర్ ప్రాజెక్టుకు వరద ఎక్కడి నుండి వస్తుంది, ప్రాజెక్టు నుండి వెళుతున్న నీరు ఎక్కడికి చేరుకుంటుంది, ప్రమాదకర కాజ్ వే లు, కాలువలు ఎక్కడెక్కడ పొంగిపోర్లుతున్నాయి ప్రజలు వాటిని దాటకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే వివరాలను అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కాలువలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట పోలీస్ సిబ్బందిని పెట్టాలని ఆదేశించారు.
వరుసగా ఎడతెరపి లేని వర్షాల కారణంగా మట్టి మిద్దెలు, ప్రహరీలు, శిథిలావస్తలో ఉన్న ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంటుందని, అలాంటి వాటిని గుర్తించి కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల గ్రామాలు, నది పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఇరిగేషన్ ఎస్.ఈ.చంద్రశేఖర్, ఈ . ఈ. జగన్మోహన్, తహశీల్దార్లు జె.కే. మోహన్, శివకుమార్ తదితరులుపాల్గొన్నారు.