29-10-2025 12:00:00 AM
మేడ్చల్, అక్టోబర్ 28(విజయ క్రాంతి): ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 138 మున్సిపాలిటీలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయగా మేడ్చల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలకు మొండి చేయి చూపింది. నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిధుల విడుదల చేస్తే ఎంతో ఆసరాగా ఉంటుందని భావించగా, ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు.
మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, పోచారం మున్సిపాలిటీ తో పాటు మరికొన్నింటికి నిధులు మంజూరు కాలేదు. రాష్ట్రంలో 138 మున్సిపాలిటీలకు రూ.2780 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 2432 పనులు చేపట్టనున్నారు. రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులతోపాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఈ నిధులు మంజూరు చేసింది.
మేడ్చల్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీ లకు రూ. 15 కోట్లు చొప్పున కేటాయించగా, ద్మగూడ, నాగారం, దుండిగల్ మున్సిపాలిటీలు, పిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లకు రూ.18.70 కోట్ల చొప్పున మంజూరు చేసింది. మొదట అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయని భావించి ప్రజల హర్షం వ్యక్తం చేశారు.
తీరా నిధులు మంజూరుకు సంబంధించి ఇంతవరకు ఈ మున్సిపాలిటీలకు ఎలాంటి సమాచారం అందలేదు. మున్సిపాలిటీలలో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగునీటి డ్రైన్ల నిర్మాణం, జంక్షన్లో అభివృద్ధి, చెరువులు, కుంటలలో కాలుష్య నివారణ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాలకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపాలిటీలలో తీవ్ర నిరసన
నిధులు మంజూరు కానీ మున్సిపాలిటీలలో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలలో తీవ్ర నిధుల కొరత ఉంది. సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అద్వాన్నంగా తయారయ్యాయి.
పట్టణ రోడ్లపై వాహనాలు నడపడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్య కూడా తీవ్ర రూపం దాల్చింది. కొన్ని మున్సిపాలిటీలలో మూడు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. మురుగునీరు రోడ్లమీద ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో నిధులు మంజూరు అయితే అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలు ఉండేది.
శివారు మున్సిపాలిటీలపై తీవ్ర నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం శివారు మున్సిపాలిటీలపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీలలో డీ లిమిటేషన్ ప్రక్రియ చేపట్టలేదు. ప్రస్తుతం నిధుల మంజూరు లోనూ వివక్ష చూపింది. వాస్తవానికి నిధుల మంజూరుకు, జిహెచ్‌ఎంసి లో విలీనానికి సంబంధం లేదు. సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పరిష్కారానికి నిధులు మంజూరు చేయాల్సింది.
రింగ్ రోడ్డు లోపల ఉన్న కొన్ని మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్ లకు నిధులు మంజూరు చేసింది. ఈ మున్సిపాలిటీలకు నిధులు ఎందుకు మంజూరు చేయలేదో అంతు చిక్కడం లేదు. మేడ్చల్, గుండ్ల పోచంపల్లి పోచారం తూముకుంట ఘట్కేసర్ తదితర మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలను విలీనం చేశారు.
ఈ గ్రామాలలో అభివృద్ధి పనులకు నిధులు అవసరం ఉన్నాయి. నిధుల మంజూరు చేయకపోవడంతో ఈ గ్రామాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. నిధులు ఎందుకు మంజూరు కాలేదో సి డి ఎం ఏ లో సంప్రదిస్తామని ఒక అధికారి తెలిపారు. ప్రభుత్వం తమ మున్సిపాలిటీలలో కూడా నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.